Potato Juice | ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటితో రకరకాల వంటకాలను చేసి తింటుంటారు. కూరగా, వేపుడు, చిప్స్, బిర్యానీ వంటి వాటిల్లో ఆలుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వీటితో జ్యూస్‌ను తయారు చేసి తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డల జ్యూస్‌ను తాగితే పోషకాలు లభించడంతోపాటు పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు. 100 ఎంఎల్ ఆలుగడ్డల జ్యూస్‌ను సేవిస్తే అనేక పోషకాలను పొందవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు బి9, బి6, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి.
ఆలుగడ్డల జ్యూస్‌ను సేవించడం వల్ల సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల పరిమాణం తగ్గుతుంది. దీంతో అసిడిటీ తగ్గుతుంది. జీర్ణాశయం, పేగుల గోడలు సురక్షితంగా ఉంటాయి. అల్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఆలుగడ్డల జ్యూస్ ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ను సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలుగడ్డల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా ఫినోలిక్ సమ్మేళనాలు, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, రుమాటిజం, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆలుగడ్డల జ్యూస్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తుంది. అందువల్ల ఆలుగడ్డల జ్యూస్‌ను సేవిస్తుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. ఆలుగడ్డలు సహజంగానే ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. లివర్‌లో ఉన్న వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. లివర్‌లో ఉండే కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటారు.
ఆలుగడ్డల జ్యూస్‌లో పొటాషియం సైతం అధికంగానే ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. రోజూ తాగితే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఆలుగడ్డల జ్యూస్‌ను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ఆలుగడ్డల జ్యూస్‌ను జుట్టుకు రాసుకుంటే శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆలుగడ్డల జ్యూస్‌తో అనేక లాభాలను పొందవచ్చు.