Nalleru | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి మొక్కల్లో నల్లేరు కూడా ఒకటి. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. నల్లేర మొక్క తీగ జాతికి చెందినంది. అయితే దీని కాండం చాలా మందంగా ఉంటుంది. వీటినే నల్లేరు కాడలు అని కూడా అంటారు. వీటికి ప్రత్యేకంగా ఆకులు అంటూ ఏమీ ఉండవు. తీగకు ఈ కాడలే ఉంటాయి. అయితే ఈ కాడలను కూరగా లేదా పచ్చడిగా కూడా చేసుకుని తినవచ్చు. నల్లేరు కాడల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఈ మొక్క అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నల్లేరు కాడలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
నల్లేరు కాడలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్నవారు తరచూ నల్లేరు కాడలను వండుకుని తింటుండాలి. దీంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. దృఢంగా కూడా మారుతాయి. నల్లేరు కాడల్లో ఉండే అనబోలిక్ స్టెరాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఎముకలను బలంగా మారుస్తాయి. త్వరగా అతుక్కునేలా చేస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఈ కాడలను తింటుంటే ఎంతగానో ప్రయోజనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఎముకలు నిర్మాణం అయ్యేందుకు ఈ కాడలు ఎంతగానో పనిచేస్తాయి. కనుక ఎముకల సమస్యలకు ఈ మొక్కను దివ్యౌషధంగా చెప్పవచ్చు.
నల్లేరు కాడలతో వండిన కూరలను తరచూ తింటుంటే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. తిన్న ఆహారంలో ఉండే కొవ్వును శరీరం శోషించుకోలేదు. అలాగే ఆహారం శక్తి మారిన తరువాత మిగిలిన శక్తి కొవ్వుగా మారకుండా చూస్తుంది. దీంతో కొవ్వు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. అలాగే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువుగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. నల్లేరు కాడలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ కాడల్లో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ కాడలను తింటుంటే మలబద్దకం ఉండదు. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఏర్పడదు. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
నల్లేరు కాడల్లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ఉంటాయి. కెరోటినాయిడ్స్, టానిన్స్, ఫినాల్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నల్లేరు కాడలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్‌ను సైతం తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. స్త్రీలు రుతు సమయంలో వీటిని తింటే తీవ్ర రక్త స్రావం నుంచి బయట పడవచ్చు. అలాగే నొప్పులు సైతం తగ్గిపోతాయి. గాయాలు, పుండ్లు మానేందుకు కూడా నల్లేరు కాడలు పనిచేస్తాయి. నల్లేరు కాడలను జ్యూస్‌గా చేసి తాగుతుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా నల్లేరు కాడలతో అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ కాడలు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.