Milk And Gulkand | రాత్రిపూట ఛాతిలో మంట, గొంతు వరకు వచ్చే ఆమ్లత్వం (అసిడిటీ) సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత లేదా ఆలస్యంగా భోజనం చేసినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది అంటాసిడ్ లపై ఆధారపడుతుంటారు. అయితే సంప్రదాయ భారతీయ ఇంటి చిట్కాలలో ఒకటైన చల్లటి పాలు – గుల్కంద్ మిశ్రమం కూడా ఈ సమస్యకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ చిట్కా ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. అయితే అసలు ఈ కలయిక నిజంగా అసిడిటీని తగ్గించగలదా? దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
పాలను సహజ అంటాసిడ్గా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. పాలలో ఉండే కాల్షియం కార్బొనేట్ పొట్టలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చల్లని పాలను తాగడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు లభిస్తాయి. మొదటిది, ఇది పొట్టలోని అదనపు ఆమ్లాన్ని తాత్కాలికంగా సమతుల్యం చేస్తుంది. దీంతో ఛాతిలో మంట తగ్గుతుంది. రెండవది, చల్లని పాలు గొంతు, ఆహారనాళంలో ఏర్పడిన మంటను తగ్గిస్తాయి. ఇది ఒక రకమైన రక్షణ పొరలా పనిచేసి ఆమ్లం నేరుగా కణజాలాన్ని తాకకుండా చేస్తుంది. అయితే అసిడిటీ సమస్య ఉన్నవారు పూర్తి కొవ్వు ఉన్న పాలకు బదులుగా తక్కువ కొవ్వు (లో-ఫ్యాట్) లేదా స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొవ్వు ఉన్న పాలు జీర్ణక్రియను నెమ్మదింపజేసి మరింత ఆమ్ల ఉత్పత్తికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ఇక గుల్కంద్ శరీరానికి సహజ చల్లదనాన్ని అందిస్తుంది. గుల్కంద్ అనేది ఎండబెట్టిన గులాబీ రేకులు, చక్కెరతో తయారుచేసే తీపి పదార్థం. ఆయుర్వేదంలో దీనిని శరీరంలోని అధిక వేడిని తగ్గించే సహజ శీతల పదార్థంగా భావిస్తారు. గులాబీ రేకుల్లో ఉండే వోలటైల్ ఆయిల్స్, టానిన్స్ స్వల్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే మంట భావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుల్కంద్ను పాలలో కలిపి తీసుకుంటే కేవలం రుచి మాత్రమే కాకుండా శరీరానికి చల్లదనం కూడా అందుతుంది. ఇంకా గుల్కంద్ స్వల్ప సహజ విరేచన గుణాన్ని కలిగి ఉంటుంది. మలబద్ధకం లేదా మందగించిన జీర్ణక్రియ వల్ల కూడా రాత్రిపూట అసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది. గుల్కంద్ జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్, ఆమ్లం పైకి రావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అసిడిటితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం మంచిది. రాత్రివేళల్లో నిద్రిస్తున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం తగ్గిపోవడంతో పొట్టలోని ఆమ్లం సులభంగా ఆహారనాళంలోకి చేరే అవకాశం ఉంటుంది. అందుకే అసిడిటీ సమస్య రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రకు సుమారు 30 నిమిషాల ముందు చల్లని పాలలో ఒక టీ స్పూన్ గుల్కంద్ కలిపి తాగితే జీర్ణాశయంలోని పీహెచ్ స్థాయిలు కొంతవరకు సమతుల్యం అవుతాయి. అలాగే గుల్కంద్లో ఉండే సహజ గ్లూకోజ్ శరీరానికి స్వల్ప శక్తిని అందించి రాత్రి శరీర మరమ్మత్తు ప్రక్రియలకు సహాయపడుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. ఈ పానీయం కొందరికి ఉపశమనం ఇచ్చినా, అందరికీ అనుకూలం కావాల్సిన అవసరం లేదు.
పాలకు అలర్జీ లేదా లాక్టోస్ అసహనం ఉన్నవారిలో గ్యాస్, పొట్ట ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. గుల్కంద్లో చక్కెర అధికంగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగడం, శరీరంలో మ్యూకస్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు ఉన్నవారిలో ఇది అసౌకర్యాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట అసిడిటీతో బాధపడేవారు అర గ్లాస్ చల్లని లో-ఫ్యాట్ పాలలో ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన గుల్కంద్ కలిపి నెమ్మదిగా తాగితే ఉపశమనం పొందవచ్చు. దీర్ఘకాలిక అసిడిటీ వెనుక హెచ్.పైలోరి ఇన్ఫెక్షన్ లేదా ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా అసిడిటీ వస్తుంటే వైద్యులను సంప్రదించడం అవసరం.