Sweet Potatoes | చిలగడదుంపలు.. వీటినే కొందరు గెనుసు గడ్డలు అని.. ఇంకొందరు కంద గడ్డలు అని కూడా పిలుస్తారు. అయితే పేరు ఏదైనప్పటికీ ఈ దుంపలు మనకు చేసే మేలు అమోఘమనే చెప్పాలి. చిలగడ దుంపలు ఇతర దుంపల్లా కాదు. ఇవి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను, పోషకాలను అందిస్తాయి. 100 గ్రాముల చిలగడ దుంపలను తింటే మనకు సుమారుగా 86 క్యాలరీల శక్తి లభిస్తుంది. అయితే ఈ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ క్యాలరీలు వెంటనే మనకు లభించవు. నిదానంగా లభిస్తాయి. కాబట్టే బరువు తగ్గాలనుకునే వారికి ఈ దుంపలు ఎంతో మేలు చేస్తాయి. చిలగడ దుంపల్లో 77 శాతం నీరు ఉంటుంది. 1.6 గ్రాముల ప్రోటీన్లు, 20.1 గ్రాముల పిండి పదార్థాలు, 4.2 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి.
100 గ్రాముల చిలగడ దుంపలను తింటే 0.1 గ్రాముల మేర కొవ్వు లభిస్తుంది. అందువల్ల కొవ్వు అత్యల్పంగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు ఈ దుంపలను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. 100 గ్రాముల గెనుసు గడ్డలను తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ ఎ లో 835 శాతం లభిస్తుంది. అలాగే విటమిన్ సి 37 శాతం, మాంగనీస్ 10 శాతం, కాపర్ 10 శాతం, విటమిన్ బి5 (పాంటోథెనిక్ యాసిడ్) 10 శాతం, విటమిన్ బి6 10 శాతం, పొటాషియం 8 శాతం, విటమిన్ బి3 (నియాసిన్) 4 శాతం లభిస్తాయి. కనుక చిలగడ దుంపలను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. పోషకాహార లోపం ఉన్నవారు వీటిని రోజుకు ఒక దుంపను తింటుంటే ఆ లోపం నుంచి బయట పడవచ్చు.
చిలగడదుంపల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ ఎ కు ఈ దుంపలను మంచి నెలవుగా చెప్పవచ్చు. అలాగే ఈ దుంపలను తింటే పొటాషియం సమృద్ధిగా లబిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ దుంపలు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా దుంపలు అంటే షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. కానీ చిలగడ దుంపలు మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే ఈ దుంపలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు, పైగా ఈ దుంపల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా ఈ దుంపలను తినవచ్చు.
చిలగడదుంపల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. చిలగడదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. చిలగడ దుంపల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. మలబద్దకం ఉన్నవారు రోజూ ఒక చిలగడ దుంపను తింటుంటే ఫలితం ఉంటుంది. ఇలా చిలగడ దుంపల వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.