Cluster Beans | మార్కెట్లో మనకు రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే ఎవరి స్థోమత, అభిరుచికి తగినట్లు వారు ఆయా కూరగాయలను కొని తెచ్చి రోజూ వండుకుని తింటుంటారు. అయితే టమాటా వంటి కూరగాయలను మనం ఎక్కువగా తింటాం. కానీ కొన్ని రకాల కూరగాయలను మాత్రం చాలా మంది మరిచిపోతుంటారు. వాస్తవానికి అలాంటి కూరగాయలు మనకు ఆరోగ్య పరంగా ఎంతగానో మేలు చేస్తాయి. అలాంటి కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. గోరు చిక్కుడు కాయలు మనకు సంవత్సరం పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ కాయలతో వేపుడు చేసి తింటే రుచి అదిరిపోతుంది. కొందరు వీటితో కూర చేసుకుని కూడా తింటారు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం గోరు చిక్కుడు కాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
గోరు చిక్కుడు కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఈ కాయలు జీర్ణ వ్యవ్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గోరు చిక్కుడు కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాయలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. పైగా ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ తగ్గేందుకు సహాయం చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఈ కాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గోరు చిక్కుడు కాయల్లో ఉండే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. ఈ కాయల్లో అధికంగా ఉండే పొటాషియం, ఫోలేట్ బీపీని నియంత్రించేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ కాయలను తింటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే గుండె పనితీరు మెరుగు పడుతుంది. గోరు చిక్కుడు కాయల్లో అధికంగా ఉండే ఫైబర్ బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. ఈ కాయల్లో ప్రోటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ కాయలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు తరచూ ఈ కాయలను తింటే మేలు జరుగుతుంది.
గోరు చిక్కుడు కాయల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ కాయలను తింటే మేలు జరుగుతుంది. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. గోరు చిక్కుడు కాయలను తింటే వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయల్లో అధికంగా ఉండే విటమిన్ కె సైతం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భిణీలకు ఈ కాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. దీంతో పిల్లలకు పుట్టిన వెంటనే లోపాలు రాకుండా ఉంటాయి. ఈ కాయల్లో విటమిన్ సి, ఎ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇలా గోరు చిక్కుడు కాయలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.