Broccoli | చూసేందుకు అచ్చం కాలిఫ్లవర్ లా ఉంటుంది. ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేం దేని గురించి చెబుతున్నామో. అదేనండీ.. బ్రోకలీ. ఇది అచ్చం కాలిఫ్లవర్‌లాగే ఉంటుంది. కానీ పువ్వు మొత్తం ఆకుపచ్చని రంగులో ఉంటుంది. మనకు బ్రోకలీ అనేక చోట్ల లభిస్తుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. బ్రోకలీని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అనేక పోషకాలు దీని ద్వారా మనకు లభిస్తాయి. బ్రోకలీ వల్ల పలు వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని సంరక్షిస్తుంది. కేవలం ఒక కప్పు బ్రోకలీని ఉడకబెట్టి తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో 100 శాతం లభిస్తుంది.
బ్రోకలీలో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా జాగ్రత్త పడవచ్చు. బ్రోకలీలో ఫోలేట్ విటమిన్ బి9 అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండేలా చేస్తుంది. పుట్టుక లోపాలు రాకుండా చూస్తుంది. కణజాల మరమ్మత్తులకు సహాయ పడుతుంది. బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది.
బ్రోకలీలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ రవాణాకు సహాయం చేస్తుంది. రక్తహీనత రాకుండా చూస్తుంది. బ్రోకలీని తినడం వల్ల క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. కండరాల పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. బ్రోకలీలో ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లూకోజ్ నియంత్రణకు సహాయం చేస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఇవే కాకుండా బ్రోకలీలో విటమిన్లు ఎ, ఇ, బి6లతోపాటు ఫాస్ఫరస్, జింక్ కూడా అధికంగానే ఉంటాయి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు.
బ్రోకలీలో ఉండే కెరోటినాయిడ్స్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి. బ్రోకలీలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా బ్రోకలీతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీన్ని ఉడకబెట్టి లేదా పెనంపై కాస్త నెయ్యి వేసి వేయించి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పచ్చిగా ఉన్నా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. బ్రోకలీని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.