Wheat Grass Juice | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది రాత్రి పూట చపాతీలను తింటుంటారు. పుల్కాల రూపంలో వాటిని కాల్చి తింటారు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి. గోధుమల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించడంతోపాటు షుగర్‌ను కూడా అదుపు చేస్తుంది. కనుకనే డయాబెటిస్ ఉన్నవారిని కూడా రాత్రి పూట చపాతీలను తినాలని చెబుతుంటారు. అయితే గోధుమలు మాత్రమే కాదు, వాటి గడ్డి కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. గోధుమలను మొలకెత్తించి అనంతరం వాటిని చిన్న కుండీలో నాటితే అవి కొద్ది రోజులకు చిన్న మొక్కలుగా మొలుస్తాయి. అలా మొలిచిన మొక్కలను కాస్త కట్ చేసి అనంతరం వాటి నుంచి జ్యూస్ తీసి తాగాలి. ఇలా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గోధుమ గడ్డిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ను సేవించడం వల్ల రక్తం తయారవుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజుకు 30 ఎంఎల్ మోతాదులో సేవిస్తుంటే రక్తం తయారవుతుంది. గోధుమ గడ్డిలో విటమిన్లు ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ గడ్డిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, అమైనో యాసిడ్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ పోషకాహార లోపం సమస్యను తగ్గిస్తాయి. శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేలా చూస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా రక్షించుకోవచ్చు.
గోధుమ గడ్డి జ్యూస్ సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. లివర్, కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్‌లో జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్‌లు ఉంటాయి. దీని వల్ల మనం తిన్న ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్‌లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గోధుమ గడ్డిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్‌ను ఉదయం సేవించడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట అనేది రాదు. నీరసం, అలసట తగ్గుతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇలా గోధుమ గడ్డి జ్యూస్‌ను సేవిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ జ్యూస్ కొందరికి పడదు. దీంతో అజీర్తి, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక డాక్టర్‌ను సంప్రదించి ఈ జ్యూస్‌ను సేవించడం మంచిది. అలాగే గోధుమ గడ్డి జ్యూస్ మనకు బయట షాపుల్లోనూ లభిస్తుంది. దీని కన్నా ఇంట్లోనే ఈ మొక్కలను పెంచి ఎప్పటికప్పుడు తాజా జ్యూస్‌ను తయారు చేసి తాగితే ఇంకా మంచిది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.