Seeds | ప్రస్తుత తరుణంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. రోజులో ఎప్పుడైనా సరే జంక్ ఫుడకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాస్త ఆకలిగా ఉంది అంటే చాలు.. జంక్ ఫుడ్ వైపు చూస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటుంది కనుక ఏది ఆర్డర్ చేసినా నిమిషాల్లో తెచ్చి ఇచ్చి వెళ్తారు. దీంతో జంక్ ఫుడ్ తినడం అధికమైంది. దీర్ఘకాలికంగా ఈ అలవాటు ఉంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలి అయినప్పుడు జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని వారు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరంలో క్యాలరీలు చేరవు. అలాగే పోషకాలు లభిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చూస్తాయి. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక నశిస్తుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అలాంటి ఆహారాల్లో సీడ్స్ మొదటి స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు.
మనకు తినేందుకు అనేక రకాల సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆకలిగా అనిపించినప్పుడు ఏదో ఒక రకానికి చెందిన విత్తనాలను తినవచ్చు. ఇవి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో జంక్ ఫుడ్ వైపు చూడడం మానేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇక సీడ్స్‌లో మొదటగా చెప్పుకోవాల్సి వస్తే.. అవిసె గింజలు అనే చెప్పాలి. చేపలు తినలేని వారికి ఇవి అత్యుత్తమ ఆహారం అని చెప్పవచ్చు. అలాగే జంక్ ఫుడ్ తినకుండా అవిసె గింజలను తింటుంటే పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే లిగ్నన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువు తగ్గేలా చేస్తాయి. అవిసె గింజలను మీరు తినే ఇతర ఆహారాలపై చల్లుకుని కూడా తినవచ్చు.
చియా సీడ్స్ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తింటే మంచిది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ గింజలను తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. జంక్ ఫుడ్ తినాలని అనిపించినప్పుడు గుమ్మడికాయ విత్తనాలను కూడా తినవచ్చు. వీటిల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ విత్తనాల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఈ గింజల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది.
నువ్వులను పెనంపై కాస్త వేయించి పెట్టుకుని ఆకలి ఆయినప్పుడు తింటుండాలి. నువ్వుల్లో సెసమిన్, సెసమోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. నువ్వులను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నువ్వులను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా నువ్వులతో బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. ఈ విధంగా పలు రకాల సీడ్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినేందుకు బదులుగా ఈ గింజలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.