Protein Rich Breakfasts | ఉదయం పూట ఆరోగ్యకరమైన చక్కటి అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల మన రోజంతా చక్కగా ఉంటుంది. ఉదయం తీసుకునే అల్పాహారమే మన మానసిక స్థితిని, శక్తికి, జీవక్రియకు ఇంధనంలా పని చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఉదయం పూట ఏది పడితే అది తినడానికి బదులు అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కండరాలు, చర్మం, అవయవాలతో సహా కణజాలాలను నిర్మించడం, మరమ్మత్తులు చేయడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు నిర్వహణకు ఇది ఎంతో కీలకం. పురుషులకు ఒక రోజుకు కిలో గ్రాము శరీర బరువుకు 55 గ్రాములు, స్త్రీలకు దాదాపు 45 గ్రాములు అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
మన శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను సంప్రదాయ భారతీయ వంటకాల ద్వారా కూడా తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. ప్రోటీన్ తో నిండిన, 300 కేలరీల కంటే తక్కువ ఉన్న భారతీయ అల్పాహారాలు కూడా చాలా ఉన్నాయని వాటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ప్రోటీన్ ను కూడా పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ తో పాటు రుచిని కూడా అందించే కొన్ని అల్పాహారాల గురించి వారు వివరిస్తున్నారు. మినపప్పు, ఇడ్లీ రవ్వ లేదా బియ్యం రవ్వతో చేసే ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలు చాలా తేలికగా జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. చట్నీ లేదా సాంబార్ తో కలిపి రెండు ఇడ్లీలను తింటే 300 కేలరీలతో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది.
మిసల్ పావ్ అనేది మహారాష్ట్రకు చెందిన ప్రధాన వంటకం. మిసల్ పావ్ లో మొలకెత్తిన మాత్ బీన్స్ ను స్పైసీ కర్రీ, క్రంచీ ఫర్సాన్ తో కలుపుతారు. దీనిని తీసుకోవడం వల్ల 300 క్యాలరీలతో పాటు గంటల తరబడి కడుపు నిండిన భావన కలుగుతుంది. మూంగ్ దాల్ చిల్లా.. నానబెట్టిన పెసలతో చేసే ఈ చిల్లా చాలా రుచిగా, ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది. గ్రీన్ చట్నీతో కలిపి తీసుకోవడం వల్ల దాదాపు 280 క్యాలరీలు, అధిక మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. కూరగాయల పులుసుతో అప్పం అనేది కేరళ క్లాసిక్ వంటకం. కూరగాయలు, కొబ్బరి పాలు కలిపి ఈ పులుసును తయారు చేస్తారు. దీనిని అప్పంతో కలిపి తీసుకోవడం వల్ల దాదాపు 250 క్యాలరీలతోపాటు ప్రోటీన్ ను కూడా పొందవచ్చు.
ధోక్లా.. శనగపిండితో చేసే ఈ గుజరాతీ వంటకం చాలా రుచిగా ఉంటుంది. నాలుగు ముక్కల ధోక్లాను తీసుకోవడం వల్ల దాదాపు 270 క్యాలరీలతో పాటు ఒక మోస్తరు ప్రోటీన్ లభిస్తుంది. అటుకులతో చేసే మధ్యప్రదేశ్ వంటకం పోహా చాలా రుచిగా పొట్టకు చాలా తేలికగా ఉంటుంది. సగటున ఇది దాదాపు 250 క్యాలరీలను అందిస్తుంది. సూజీ, కూరగాయలతో చేసే ఉప్మాను తీసుకోవడం వల్ల సమతుల్య పోషణ లభిస్తుంది. సగటున ఈ ఉప్మా 230 క్యాలరీలను అందిస్తుంది. బీహరీలకు ఎంతో ఇష్టమైన సత్తు పరాటాను తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. శనగపిండితో చేసే ఈ వంటకం దాని పరిమాణం, దానిని కాల్చడానికి వాడే నూనెను బట్టి క్యాలరీలను అందిస్తుంది. ప్రతి సర్వింగ్ దాదాపు 175 నుండి 300 క్యాలరీలు లభిస్తాయి.
బియ్యం, మినపప్పుతో చేసే సాదా దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా లభిస్తుంది. తక్కువ నూనెతో తయారు చేసినప్పుడు ఒక దోశను తీసుకోవడం వల్ల 100 నుండి 160 క్యాలరీలు లభిస్తాయి. మసాలా వెజిటేబుల్ ఆమ్లెట్.. తక్కువ నూనెతో రెండు గుడ్లు, కూరగాయలు కలిపి చేసే ఈ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. ఒక్క ఆమ్లెట్ ను తీసుకోవడం వల్ల 180 నుండి 220 క్యాలరీల లోపు శక్తి లభిస్తుంది. ఈ విధంగా మనం తక్కువ క్యాలరీలతో రుచికరమైన అల్పాహారాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు అలాగే కండరాలు బలంగా పెంచాలనుకునే వారు ఈ విధంగా రుచికరమైన అల్పాహారాలను తయారు చేసి తీసుకుంటే రుచితో పాటు పోషకాలను కూడా పొందవచ్చు.