Herbal Teas | ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కాఫీ లేదా టీ లను ఇష్టంగా తాగుతుంటారు. ఇక మన దేశంలో అయితే చాలా మంది టీ ప్రియులే ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బయట ఎక్కడ టీ బండి చూసినా సరే కచ్చితంగా రద్దీగా కనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే చాలా మంది టీల మీద టీలను తాగేస్తుంటారు. చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ టీని కూడా తాగుతుంటారు. అయితే టీని అధికంగా సేవించడం అంత ఆరోగ్యకరం కాదు. అందులో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. రోజుకు 450 మిల్లీగ్రాముల కన్నా కెఫీన్‌ను తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావాలు పడతాయి. అందుకని మరీ అతిగా టీని సేవించకూడదు. అయితే టీ తాగాలని ఉంటే అందుకు బదులుగా హెర్బల్ టీలను సేవించవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. పైగా రుచిగా కూడా ఉంటాయి.
టీని అధికంగా తాగేవారు అందుకు బదులుగా బ్లాక్ టీని సేవించవచ్చు. ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తుంది. బ్లాక్ టీని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. టీని ఎక్కువగా తాగేవారు అందుకు బదులుగా గ్రీన్ టీని సేవించాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతోపాటు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
ఊలాంగ్ టీ అనే టీ వెరైటీని కూడా చాయ్ ప్రియులు సేవించవచ్చు. ఇది కూడా ఎంతో ఆరోగ్యవంతమైన టీగా పరిగణించబడుతుంది. ఇందులోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలను వేగంగా ఖర్చు చేయవచ్చు. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. అలాగే వైట్ టీని కూడా సేవించవచ్చు. ఇందులో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు ఈ టీని సేవిస్తే మేలు జరుగుతుంది. అలాగే చర్మం, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
ఇక ఇవే కాకుండా మార్కెట్లో మనకు పలు రకాల హెర్బల్ టీలు కూడా లభిస్తున్నాయి. లావెంటర్, యాలకులు, లవంగాలు, మందార పువ్వులు, రోజ్ ఫ్లవర్ టీ, కమోమిల్ టీ.. ఇలా హెర్బల్ టీలలో అనేక రకాలు ఉన్నాయి. వీటిల్లో ఏ టీని అయినా సరే మీరు మీ ఫ్లేవర్ కు అనుగుణంగా తాగవచ్చు. రోజుకు ఒక కప్పు హెర్బల్ టీని సేవించినా చాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. హెర్బల్ టీని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇమ్యూనిటీ పెరగడంతోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు రకాల హెర్బల్ టీలను మీరు టీకి బదులుగా సేవించండి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.