Hemoglobin Fruits | మన శరీరంలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్. ఐరన్ సహాయంతో హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజన్‌ను గ్రహించి శరీర భాగాలకు చేరవేస్తుంది. మళ్లీ శరీర భాగాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఊపిరితిత్తులకు చేర వేస్తుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే పోషకాలను కూడా కణాలకు అందిస్తుంది. ఇలా హిమోగ్లోబిన్ మన శరీరంలో విధులను నిర్వహిస్తుంది. అయితే శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించదు. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా వస్తుంది. కనుక శరీరంలో హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అయితే పలు రకాల ఆహారాలను తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.
యాపిల్ పండ్లలో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. అందుకని రోజుకు ఒక యాపిల్ ను తింటే కావల్సినంత ఐరన్ లభిస్తుంది. మన శరీరం ఈ ఐరన్‌ను శోషించుకుంటుంది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే దానిమ్మ పండ్లనుకూడా తినవచ్చు. ఈ పండ్లలోనూ ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అరటి పండ్లలోనూ ఐరన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ పండ్లలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ తయారీకి దోహదం చేస్తాయి. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. జామ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా వీటి ద్వారా సమృద్ధిగానే లభిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాల తయారీకి దోహదం చేస్తాయి. దీని వల్ల హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. వీటిని తింటే శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది. ఇది హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది.
పుచ్చకాయలను తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గడమే కాదు, ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్, విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటాయి. పుచ్చకాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచవచ్చు. దీంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కివి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. దీంతో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. ఆరోగ్యంగా ఉంటారు.