Foods To Reduce Summer Heat | వేసవి కాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇంకా వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాక ముందే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇక మే నెల వస్తే సూర్యుని ప్రతాపం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వేసవి కాలంలో సురక్షితంగా ఉండాలన్నా, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలన్నా.. శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను పలు రకాల పండ్లు మనకు ఎంతో దోహదం చేస్తాయి. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.
మన శరీరాన్ని చల్లగా ఉంచడంలో పుచ్చకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. మరీ పూర్తిగా ఎండాకాలం ప్రారంభం అయ్యే వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయల్లో 92 శాతం వరకు నీరే ఉంటుంది. అలాగే ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి6, సి, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పోషణను అందివ్వడంతోపాటు ఎండ వేడి నుంచి మనల్ని రక్షిస్తాయి. శరీరం చల్లగా ఉండేలా చూస్తాయి. పుచ్చకాయను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే వేసవి తాపం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే కీరదోసలను కూడా ఇప్పటి నుంచే ఆహారంలో భాగం చేసుకోవాలి.
కీరదోసలలో 95 శాతం నీరు ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కీరదోసను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. వేసవి తాపం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. వేసవి కాలంలో మన శరీరంలోని ద్రవాలు సులభంగా ఆవిరైపోతుంటాయి. అందుకని నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లను సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్‌గా చెబుతారు. ఈ నీళ్లను వేసవిలో తాగుతుంటే శరీరం కోల్పోయిన ద్రవాలతోపాటు మినరల్స్ కూడా లభిస్తాయి. వేసవిలో చాలా మంది కూల్ డ్రింక్స్ ను తరచూ తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో ఉండే వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది.
పుదీనాలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. మీరు తాగే నీటిలో పుదీనా రసం కలిపి తాగితే చాలు, శరీరం చల్లబడుతుంది. పుదీనా జీర్ణక్రియను సైతం మెరుగు పరుస్తుంది. శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. వేసవి కాలంలో కచ్చితంగా పెరుగు లేదా మజ్జిగను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటికి శరీరాన్ని చల్ల బరిచే గుణాలు ఉంటాయి. భోజనం చేసినప్పుడు లేదా ఇతర సమయాల్లోనూ చల్ల చల్లని పెరుగు లేదా మజ్జిగను తాగవచ్చు. అలాగే నిమ్మరసం మనకు తాజాదనాన్ని అందించడమే కాదు, శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా పనిచేస్తుంది. నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే శరీరంలోని వేడిని బయటకు పంపించవచ్చు. అదేవిధంగా ఆకుపచ్చని కూరగాయలతోపాటు ఆకుకూరలను కూడా ఈ సీజన్ లో అధికంగా తీసుకోవాలి. దీంతో శరీరం వేడిగా మారదు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.