Bones Health | ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తినేవారు. అందుకనే వారు వృద్దాప్యంలోనూ అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఎలాంటి శారీరక శ్రమను అయినా సరే చాలా అలవోకగా చేయగలిగేవారు. ముఖ్యంగా వారు ఆరోగ్యకరమైన దేహంతోపాటు దృఢమైన ఎముకలను సైతం కలిగి ఉండేవారు. అందుకనే వారికి అంత బలం ఉండేది. అయితే ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులోనే ఎముకల సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. పోషకాహారం తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కనుక ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారాలను తినాల్సి ఉంటుంది.
ఎముకల ఆరోగ్యానికి కేవలం క్యాల్షియం మాత్రమే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ దాంతోపాటు విటమిన్ డి కూడా ఉండాల్సిందే. అలాగే ఫాస్ఫరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ ఉండే ఆహారాలను తినడం కూడా అవసరమే. ఇవన్నీ ఉండే ఆహారాలను తింటేనే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు గాను క్యాల్షియం ఎంతో దోహదం చేస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను దృఢంగా మారేలా చేస్తుంది. ఎముకల నిర్మాణానికి, ఎముకలు త్వరగా అతుక్కోవడానికి సహాయం చేస్తుంది. క్యాల్షియం మనకు పాలు, పెరుగు, చీజ్, పనీర్ వంటి ఆహారాల్లో అధికంగా లభిస్తుంది. అలాగే పాలకూరను తింటున్నా కూడా క్యాల్షియం సమృద్ధిగానే లభిస్తుంది. తోటకూరలో ఉండే విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక దీన్ని కూడా తరచూ తినాలి.
బాదంపాలు, సోయా పాలు, తృణ ధాన్యాలు, నారింజ రసం వంటి వాటిని తీసుకుంటున్నా కూడా క్యాల్షియంను అధిక మొత్తంలో పొందవచ్చు. చేపల్లోనూ క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఇక ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి కూడా ఎంతో అవసరం. శరీరంలో విటమిన్ డి తగిన మొత్తంలో ఉంటేనే మనం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. విటమిన్ డి మనకు చేపల్లో అధికంగా లభిస్తుంది. పాల, నారింజ రసం కూడా తీసుకోవచ్చు. తృణ ధాన్యాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. కోడిగుడ్డు పచ్చ సొనలో విటమిన్ డి అధిక మొత్తంలో లభిస్తుంది. పుట్ట గొడుగులను తినడం వల్ల కూడా ఈ విటమిన్ ను పొందవచ్చు.
విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. విటమిన్ కె వల్ల ఎముకలు నిర్మాణమవడంతోపాటు ఎముకలకు బలం లభిస్తుంది. విటమిన్ కె మనకు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలతోపాటు బ్రోకలీలోనూ లభిస్తుంది. సోయాబీన్స్ ను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. మెగ్నిషియం అధికంగా ఉండే నట్స్, విత్తనాలు, పప్పు దినుసులను తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. మెగ్నిషియం వల్ల విటమిన్ డిని శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఫాస్ఫరస్ కూడా ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మాంసం, తృణ ధాన్యాల్లో అధికంగా లభిస్తుంది. ఇలా ఆయా ఆహారాలను తింటుంటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.