Calcium Foods | పూర్వం మన పెద్దలు క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తినేవారు. అందుకనే వారు వయస్సు మీద పడినప్పటికీ దృఢంగా ఉండేవారు. ఎంతో కష్టమైన పనులను సైతం వృద్ధాప్యంలో అవలీలగా చేసేవారు. అయితే శారీరకంగా దృఢంగా ఉండేందుకు కావల్సిన మినరల్స్‌లో క్యాల్షియం కూడా ఒకటి. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది. కనుక క్యాల్షియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. ఈ ఆహారాల వల్ల మనకు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. క్యాల్షియం ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడంతోపాటు విటమిన్ డి కూడా అందేలా చూసుకోవాలి. దీంతో మన శరీరం క్యాల్షియంను సులభంగా శోషించుకుంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాల్లో అంజీర్ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లను రోజూ రాత్రి పూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. రోజుకు ఒక కప్పు అంజీర్ పండ్లను తింటే సుమారుగా 121 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం పొందవచ్చు. అలాగే ఈ పండ్లలో ఉండే పొటాషియం హైబీపీని నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీర్ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచ బయట పడవచ్చు.
ఒక పెద్ద నారింజ పండును తినడం వల్ల మనకు సుమారుగా 74 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంద. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల విటమిన్ డి ని కూడా పొందవచ్చు. దీంతో శరీరం క్యాల్షియంను సులభంగా శోషించుకుంటుంది. అలాగే సార్డైన్ అనే చేపలను 120 గ్రాముల మేర తింటే దాదాపుగా 351 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. వీటి ద్వారా విటమిన్ బి12 ను కూడా పొందవచ్చు. ఇది మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
బెండకాయల్లోనూ క్యాల్షియం సమృద్ధిగానే ఉంటుంది. ఒక కప్పు బెండకాయలను తింటే సుమారుగా 82 మిల్లీగ్రాముల మేర క్యాల్షియంను పొందవచ్చు. అలాగే బెండకాయల ద్వారా మనకు విటమిన్ బి6, ఫోలేట్ లభిస్తాయి. ఆరోగ్యానికి బాదంపప్పు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ 30 గ్రాముల మేర బాదంపప్పును తింటే సుమారుగా 75 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. బాదంపప్పును రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పొట్టు తీసి బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. దీంతో క్యాల్షియంను సమృద్ధిగా పొందవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.