Calcium Foods | క్యాల్షియం మన ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగ్గా పనిచేసేందుకు కూడా ఇది దోహదపడుతుంది. కనుకనే మనం రోజుకు కనీసం 1000 మిల్లీగ్రాముల మేర క్యాల్షియంను తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం మనకు ప్రధానంగా పాలు, పాల సంబంధ పదార్థాల నుంచి వస్తుంది. అయితే పాలను తాగడం ఇష్టం లేని వారు, లాక్టోజ్ పడనివారు ఆహారంలో పాలకు బదులుగా క్యాల్షియం కోసం కొన్ని ఆహారాలను తీసుకోవచ్చు. దీంతో క్యాల్షియంతోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ కూడా లభిస్తాయి.
అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లను అర కప్పు తింటే చాలు మనకు సుమారుగా 121 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరును, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించడం వంటి పలు పనుల్లో సహాయం చేస్తాయి. అంజీర్ పండ్ల ద్వారా మెగ్నిషియం కూడా మనకు లభిస్తుంది. దీని వల్ల రాత్రిపూట కాలి పక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. కండరాల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఒక పెద్ద నారింజ పండులో సుమారుగా 74 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాలరీలు కూడా తక్కువగానే లభిస్తాయి. కనుక అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా నారింజ పండ్లను తినవచ్చు. దీంతోపాటు ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
చేపలను 120 గ్రాములు తీసుకుంటే 351 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ బి12 కూడా మనకు చేపల ద్వారా ఎక్కువగానే లభిస్తుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి తోడ్పడే విటమిన్ డి సైతం చేపల ద్వారా మనకు లభిస్తుంది. కనుక చేపలను వారంల కనీసం 2 సార్లు తింటే ఎంతో మేలు జరుగుతుంది.
బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. వీటిని ఒక కప్పు తింటే మనకు సుమారుగా 82 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. బెండకాయల్లో విటమిన్ బి6, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రోటీన్‌తోపాటు క్యాల్షియంతో నిండిన టోఫు శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోఫులో 434 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కనుక క్యాల్షియంకు టోఫు చక్కని వనరు అని చెప్పవచ్చు. అలాగే బాదంపప్పులను తినడం వల్ల కూడా మనకు క్యాల్షియం లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే నట్స్‌లో బాదం పప్పు ఒకటి. 30 గ్రాముల బాదంపప్పును తింటే సుమారుగా 75 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. వీటిని పొట్టు తీసి తినడం మంచిది. బాదంపప్పులో విటమిన్ ఇ, పొటాషియం కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవచ్చు.