Sprouts | ప్రస్తుతం మన జీవన విధానం పూర్తిగా యాంత్రికం అయిపోయింది. దీని వల్ల చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. చాలా మందికి అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వ్యాయామం చేయడం, ఇతర సూచనలు పాటించడం చేస్తుంటారు. కానీ పోషకాల విషయంలోనే సరైన ఆహారాన్ని తీసుకోరు. ఆరోగ్యం కోసం పోషకాలు కలిగి ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. పోషకాల విషయానికి వస్తే మొలకల్లో ఉన్నన్ని పోషకాలు ఇతర ఏ ఆహారాల్లోనూ ఉండవనే చెప్పాలి. మొలకలను తినాలని చాలా మంది సూచిస్తుంటారు కూడా. పోషకాహార నిపుణులు కూడా ఇదే విషయం చెబుతుంటారు.
శనగలు, పల్లీలు, మెంతులు, అవిసె గింజలు, బార్లీ గింజలు, పెసలు వంటి అనేక దినుసులు, గింజలు, విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెసలను చాలా సులభంగా మొలకెత్తించి తినవచ్చు. ఒక రాత్రంతా పెసనలను నానబెట్టాలి. సుమారుగా 12 గంటల పాటు పెసలు నానిన తరువాత వాటిని తీసి ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి మూటకట్టాలి. దీన్ని చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి. పొడి వాతావరణం ఉండాలి. ఇలా చేస్తే 1 నుంచి 2 రోజుల్లో మొలకలు వస్తాయి. ఇలా అన్ని రకాల గింజలను మొలకెత్తించి తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. మొలకలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది.
మొలకల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది. మొలకలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. మొలకలతో వంటలు, సలాడ్స్ వంటివి చేసుకుని కూడా తినవచ్చు. మొలకలు తయారయ్యాక నేరుగా అలాగే తినకూడదు. ముందుగా వాటిని కాస్త కడగాలి. లేదంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నేరుగా మన శరీరంలోకి చేరుతుంది. ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొలకలు తయారు అయ్యాక వాటిని కడిగి నీళ్లు లేకుండా చేసి పెనంపై కాస్త వేయించి తినాలి. లేదా అందులోనే కాస్త కారం,ఉప్పు చల్లి తినవచ్చు. మొలకల్లో విటమిన్లు ఎ, బి1, సి, బి6, కె ఉంటాయి. వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నిషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
మొలకల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీర నిర్మాణానికి దోహదం చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మొలకలను తింటే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును పెంచడంతోపాటు కంటి సమస్యలను తగ్గిస్తుంది. మొలకల్లో అనేక ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తి అందేలా చూస్తాయి. దీని వల్ల ఉదయం మొలకలను తింటే రోజంతా చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎప్పుడూ నీరసం, అలసట అనేవి రావు. మొలకల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. నాన్ వెజ్ తినలేని వారికి మొలకలు ఒక వరం అనే చెప్పవచ్చు ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఇలా మొలకలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.