Shankhapushpi Flowers Tea | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా అనేకం ఉన్నాయి. కానీ అలాంటి చాలా వరకు మొక్కల గురించి అధిక శాతం మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో శంఖపుష్పి మొక్క కూడా ఒకటి. దీన్ని చూసి చాలా మంది పిచ్చి మొక్క అని అనుకుని ఉంటారు. కానీ ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. నీలి రంగు పువ్వులతో ఈ మొక్కలు తీగ లాగా అల్లుకుని కనిపిస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా ఈ పువ్వులు ఉంటాయి. అలాగే తెలుపు రంగు శంఖ పుష్పి పువ్వులు కూడా ఉంటాయి. కానీ నీలి రంగు పువ్వుల్లోనే ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పువ్వులను నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసి రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
శంఖపుష్పి పువ్వులతో టీ తయారు చేసుకుని సేవించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మూడ్ మారుతుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. శంఖపుష్పి పువ్వులు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు టానిక్‌లా ఇలా పనిచేస్తాయి. మెదడును చురుగ్గా, ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మతిమరుపును తగ్గిస్తాయి. దీంతో చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శంఖపుష్పి పువ్వుల టీని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ తగ్గుతుంది.
శంఖపుష్పి పువ్వుల టీని తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను రక్షిస్తాయి. దీని వల్ల హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. సైంటిస్టులు ఈ విషయంపై పరిశోధనలు కూడా చేస్తుండడం విశేషం. శంఖపుష్పి పువ్వులను సేకరించి బాగా కడిగి శుభ్రం చేసిన అనంతరం వాటిలో ఎండబెట్టాలి. తరువాత వాటిని డికాషన్ తయారు చేసేందుకు ఉపయోగించాలి. ఇలా ఎండిన పువ్వులను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక పాత్రలో నీటిలో వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తరువాత వడకట్టి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. రుచి కోసం ఇందులో అవసరం అనుకుంటే కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు.
మార్కెట్లో మనకు శంఖపుష్పి పువ్వులకు చెందిన పొడి కూడా లభిస్తుంది. దీన్ని కూడా టీ తయారు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ మోతాదులో ఈ పొడిని తీసుకుని డికాషన్ తయారు చేసుకోవాలి. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సేవిస్తే మేలు జరుగుతుంది. శంఖపుష్పి పువ్వుల టీని ఉదయం సేవిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. అదే ఈ పువ్వుల టీని సాయంత్రం సేవిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. శంఖపుష్పి పువ్వుల టీని సేవించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. అయినప్పటికీ అలర్జీలు ఉన్నవారు ఈ టీని తాగకపోవడమే మంచిది. అలాగే లోబీపీ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ టీని సేవించకూడదు.