Sapota | ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అందులో భాగంగానే మనకు ఏడాది పొడవునా లభించే పండ్లతోపాటు సీజన్లను బట్టి లభించే పండ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లను చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. అలాంటి పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. ఇవి తియ్యగా ఉన్నప్పటికీ చాలా మంది వీటిని తినరు. కానీ సపోటా పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సపోటా పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల సపోటా పండ్లను తింటే సుమారుగా 140 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 34 గ్రాములు, చక్కెరలు 15 గ్రాములు, ఫైబర్ 9 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము, కొవ్వులు 2 గ్రాములు లభిస్తాయి.
సపోటా పండ్లలో విటమిన్లు ఎ, సి, ఇ లతోపాటు పలు రకాల బి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. శరీరానికి పోషణ లభిస్తుంది. సపోటా పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండ్లలో ఉండేదంతా సహజసిద్ధమైన చక్కెరనే. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను ఎలాంటి అభ్యంతరం లేకుండా తినవచ్చు. కానీ మోతాదులో తినాల్సి ఉంటుంది. సపోటా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరంతోపాటు గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
సపోటా పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ చక్కెరలు నిరంతరాయంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీంతో శక్తి లభిస్తూనే ఉంటుంది. ఈ పండ్లను ఉదయం తింటే రోజంతటికీ శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఈ పండ్లలో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, రోగాలను తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఉండే పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది.
సపోటా పండ్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. హైబీపీ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లను తింటే శరీరంలో అధికంగా ఉండే సోడియం బయటకు వెళ్లిపోతుంది. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. సపోటా పండ్లలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. అలాగే ఫాస్ఫరస్, ఐరన్ సైతం లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. సపోటా పండ్లను తింటే దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా ఈ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.