Sapota | మన ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పండ్లల్లో సపోటా పండు కూడా ఒకటి. ఈ పండు చాలా రుచిగా తియ్యగా ఉంటుంది. దీనిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. సపోటా పండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో విటమిన్ ఎ, బి, సి, ఇ, క్యాల్షియం,ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. సపోటాను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సపోటాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సపోటాలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సపోటా మనకు ఎంతో దోహదపడుతుంది. సపోటా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సపోటా పండ్లను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసటను తగ్గించి శక్తిని ఇవ్వడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. తరచూ అలసట, బలహీనతతో బాధపడే వారు సపోటాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సపోటాలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
కళ్ల ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా సపోటా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. సపోటా పండును తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. ఇక రక్తహీనతతో బాధపడే వారికి సపోటా దివ్యఔషధంలా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా సపోటా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే సపోటా మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరమని కూడా వారు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తినకుండా ఉండడమే మంచిదని వారు తెలియజేస్తున్నారు. దీనిలో లేటెక్స్, టానిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఊబకాయం, గుండె జబ్బులు ఉన్న వారు కూడా దీనిని వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.