Ridge Gourd Juice | రోజూ మనం వివిధ రకాల కూరలను చేసుకుని అన్నం లేదా చపాతీలతో కలిపి తింటాం. వివిధ రకాల కూరగాయలు, ఆకుకుకూరలు, పప్పు దినుసులతో సాధారణంగా చాలా మంది కూరలను చేస్తుంటారు. అలా మనకు అందుబాటులో కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. దీంతో పప్పు లేదా పచ్చడి చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. బీరకాయలను కొందరు తినరు. కానీ ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీరకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీరకాయలను రోజూ తినలేరు. కనుక వీటిని జ్యూస్‌లా చేసి రోజూ ఉదయం పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. బీరకాయలను ఆసియా దేశాల వాసులు ఎక్కువగా తింటారు. ఇది అనేక పోషకాలను, ఔషధ విలువలను కలిగి ఉంటుంది.
బీరకాయల్లో క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. నీరు అధిక శాతం ఉంటుంది. ఫైబర్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. బీరకాయలతో జ్యూస్ తయారు చేసి రోజూ తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవచ్చు. బీరకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటి జ్యూస్‌ను తాగితే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది.
బీరకాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి జ్యూస్‌ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. పైగా వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఇది షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చూస్తుంది. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారు రోజూ బీరకాయల జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. బీరకాయలు లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాయలను తింటున్నా లేదా వీటి జ్యూస్‌ను తాగుతున్నా లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఎంజైమ్‌లు ఉత్తేజితం అవుతాయి. ఇవి లివర్‌ను రక్షిస్తాయి. లివర్ కణాలకు నష్టం జరగకుండా ఉంటుంది. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. జీవక్రియలు అన్నీ సక్రమంగా నిర్వర్తించబడతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.
బీరకాయల్లో క్యాలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సితోపాటు ఐరన్, మెగ్నషియం, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బీరకాయల్లో ఫ్లేవనాయిడ్స్, ఇతర సమ్మేళనాలు ఉండడం వల్ల ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఉండే వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా బీరకాయలను తరచూ తింటున్నా లేదా రోజూ వాటి జ్యూస్‌ను తాగుతున్నా అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.