Water Apples | వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్ లేదా వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పండ్లను పండిస్తున్నారు. వాటర్ యాపిల్ పేరుకు తగినట్లుగానే 90 శాతం మేర నీటిని కలిగి ఉంటుంది. ఇవి పండనప్పుడు ఆకుపచ్చగా, బాగా పండినవి పింక్ రంగులో ఉంటాయి. ఈ పండ్లు కాస్త చప్పగా ఉంటాయి. కానీ ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. వాటర్ యాపిల్స్‌ను తినడం వల్ల శరీరానికి నీరు లభించడమే కాదు, అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌ను కూడా పొందవచ్చు. ఈ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటర్ యాపిల్స్‌ను తినడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వేడి తగ్గిపోతుంది.
వాటర్ యాపిల్‌లో విటమిన్లు సి, ఎ, ఇ, బి1, బి2, బి3 సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ కూడా అధికంగా లభిస్తాయి. వాటర్ యాపిల్స్‌లో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది తెల్ల రక్త కణాలు పెరిగేలా చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను తగ్గిస్తుంది. వాటర్ యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ప్రీ బయోటిక్ ఆహారంగా ఈ పండ్లు పనిచేస్తాయి. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చూస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థలో ఆహారం కూడా సులభంగా కదులుతుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి వాటర్ యాపిల్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తరచూ వాటర్ యాపిల్స్‌ను తింటే ఫలితం ఉంటుంది. అలాగే వాటర్ యాపిల్స్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు ఉండదు. సోడియం కూడా ఉండదు. ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. వాటర్ యాపిల్స్‌లో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు పనిచేస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వాటర్ యాపిల్స్ లో అధికంగా ఉండే విటమిన్లు సి, ఎ, ఫినోలిక్ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వాటర్ యాపిల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మానికి సూర్య కిరణాల వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తాయి. కాలుష్య కారకాలు, ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మానికి కలిగే హాని తగ్గుతుంది. వాటర్ యాపిల్స్‌ను తినడం వల్ల ప్రారంభ దశలో ఉండే క్యాన్సర్‌ను సులభంగా తగ్గించవచ్చని పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా వాటర్ యాపిల్స్‌ను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.