Phool Makhana | తియ్యని వంటకాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో లేదా బయట ఫంక్షన్లలో, ఇతర ఎక్కడైనా సరే తీపి వంటకాలు కనిపిస్తే రుచి చూసే దాకా వదలరు. తియ్యని వంటకాలను చూడగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. అయితే తియ్యని వంటకాల కోసం ఎక్కువగా ఫూల్ మఖనాలను ఉపయోగిస్తారు. వీటిని ఆయా వంటల్లో వేసినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక ఫూల్ మఖనాలను చాలా మంది బయట మార్కెట్లో చూసే ఉంటారు. వీటినే లోటస్ సీడ్స్ అని, తామర విత్తనాలు అని కూడా అంటారు. తామర విత్తనాలను వేయించి వీటిని తయారు చేస్తారు. ఫూల్ మఖనాలు కాస్త ఖరీదు ఎక్కువగానే కలిగి ఉంటాయి. అయితే ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఫూల్ మఖనాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఫూల్ మఖనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండి ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆకలి వేయదు. దీంతో తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలని చూస్తున్నవారు తమ డైట్ ప్లాన్‌లో ఫూల్ మఖనాలను చేర్చుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. అలాగే వీటిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫూల్ మఖనాలలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే బీపీ అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది.
ఫూల్ మఖనాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఫూల్ మఖనాలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ఫూల్ మఖనాలను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది కనుక కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫూల్ మఖనాలను తింటే క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కనుక ఫూల్ మఖనాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
అయితే ఫూల్ మఖనాలను తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ కొందరికి వీటిని తింటే పడవు. గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఫూల్ మఖనాలను తినడం మానేయాలి. ఇక ఫూల్ మఖనాలను మోతాదులో తింటే ఏమీ కాదు. కానీ అధికంగా తింటే మాత్రం షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొందరికి వీటిని తింటే అలర్జీలు వచ్చే చాన్స్ ఉంది. ఫుడ్ అలర్జీ సమస్య ఉన్నవారు కూడా వీటిని తినకపోవడమే మంచిది. ఇక మిగిలిన ఎవరైనా సరే ఫూల్ మఖనాలను తినవచ్చు. దీంతో లాభాలను పొందవచ్చు.