Ragi Roti | ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ముఖ్యంగా మిల్లెట్ల వాడకం ఎక్కువైందని చెప్పవచ్చు. ఆరోగ్యం కోసం రకరకాల మిల్లెట్లను తింటున్నారు. మిల్లెట్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి వాటిని చాలా మంది తింటున్నారు. ఇక చిరు ధాన్యాల విషయానికి వస్తే వాటిల్లో రాగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాగులనే ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది రాగులను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. రాగులతో పిండి తయారు చేసి దాంతో జావ చేసుకుని తాగవచ్చు. లేదా రాగి పిండితో రొట్టెలను తయారు చేసి తినవచ్చు. రాగి రొట్టెలు ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. మీరు రోజూ బరువు తగ్గించే ప్రణాళికలో ఉంటే, డయాబెటిస్ లేదా కొలెస్ట్రాల్ ఉంటే కచ్చితంగా రాగి రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
రాగుల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రాగులతో రొట్టెలను తయారు చేసి తింటే ఈ పోషకాలన్నింటినీ రోజూ పొందవచ్చు. గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. అందువల్లే ఈ పిండి సాగుతుంది. అయితే కొందరికి గ్లూటెన్ అంటే అలర్జీ ఉంటుంది. అలాంటి వారు గోధుమలతో తయారు చేసిన చపాతీలను తినలేకపోతుంటారు. అలాంటి వారు రాగులతో తయారు చేసే రోటీలను తినవచ్చు. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. కనుక అలర్జీలు అన్న మాటే ఉండదు. అలర్జీలు ఉన్నవారు రాగులతో రొట్టెలను తయారు చేసి తింటే అనేక లాభాలను పొందవచ్చు.
రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత సులభంగా పెరగవు. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ రాగులతో రొట్టెలను చేసి తింటుంటే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీని వల్ల ఇతర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలని చూస్తున్నవారికి కూడా రాగులు ఎంతో దోహదం చేస్తాయని చెప్పవచ్చు. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తీసుకోవడంపై నియంత్రణ ఏర్పడుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు రాగులను రోజూ తీసుకుంటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి కూడా పుష్కలంగానే లభిస్తుంది. అందువల్ల రాగులతో రొట్టెలను తయారు చేసి తింటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. రాగల్లో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బీపీని తగ్గిస్తాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. రాగులతో రొట్టెలను తయారు చేసి తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇలా రాగులతో అనేక లాభాలు కలుగుతాయి కనుక రాగులను రోజూ తినడం మరిచిపోకండి.