Radish | మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో మనకు కనిపిస్తుంది. చాలా మంది తెలుపు రంగుకు చెందిన ముల్లంగిని ఉపయోగిస్తారు. అయితే ముల్లంగికి ఉండే ఘాటైన వాసన, రుచి కారణంగా చాలా మంది దీన్ని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ దీంతో జ్యూస్ తయారు చేసి రోజూ ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ అని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.
ముల్లంగిలో ఉండే పాలిశాకరైడ్స్ కారణంగా ఇది ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అంటే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుందన్నమాట. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థకు బలం కలుగుతుంది. ముల్లంగిలో అమైలేజ్ అనే సహజసిద్ధమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే సంక్లిష్టమైన పిండిపదార్థాలను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ముల్లంగిలో ఉండే గ్లూకోసైనోలేట్స్ అనే సమ్మేళనాలు, ఐసోథయోసయనేట్స్ అనే సమ్మేళనాలు పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తాయి. దీంతో లివర్‌లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. దీని వల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను నివారించవచ్చు. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది. ముల్లంగిలో అధికంగా ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. అందువల్ల తరచూ ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకుంటే సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం, ఇన్ ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. శరీర జీవక్రియలు సైతం సక్రమంగా నిర్వహించబడతాయి.
ముల్లంగి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ముల్లంగిని రోజూ తీసుకుంటే ఎంతగానో ఉపయోగం కలుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముల్లంగిలో ఉండే యాంథో సయనిన్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. రక్త నాళాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ముల్లంగి ఎంతగానో మేలు చేస్తుంది. ఇలా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.