Punti Kura | పుంటి కూర.. దీన్నే గోంగూర అని కూడా అంటారు. మనకు ఏ సీజన్లో అయినా సరే గోంగూర ఎక్కువగానే లభిస్తుంది. ముఖ్యంగా వేసవిలో పుల్ల పుల్లగా ఉండే పుంటి కూరను తింటే వచ్చే మజాయే వేరు. దీంతో పప్పు, పచ్చడి, పులుసు వంటివి చేసి తింటారు. అన్నంలో ఈ కూరలను వేసి కలిపి నెయ్యితో తింటే రుచి అదిరిపోతుంది. పుంటి కూర పప్పు లేదా పచ్చడి సూపర్‌గా ఉంటాయి. అయితే ఆరోగ్య పరంగా చూస్తే ఈ కూర మనకు అనేక లాభాలను అందిస్తుంది. పుంటి కూరను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీంట్లో అనేక పోషకాలు ఉంటాయి. పుంటి కూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తహీనత ఉన్నవారు పుంటి కూరను తింటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.
పుంటి కూరలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, సి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. పుంటి కూరలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఈ కూరలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. పుంటి కూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరలో పీచు కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి బయట పడవచ్చు. పుంటి కూరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లది కాగా మరొకటి ఎర్రది. ఎర్రని పుంటి కూరను మనం తరచూ వంటల్లో వాడుతాం. తెల్లని పుంటి కూరతో నిల్వ పచ్చడి పెడుతుంటారు. ఇది టేస్ట్‌లో అదిరిపోతుంది.
గాయాలు, పుండ్లను తగ్గించడంలోనూ పుంటి కూర పనిచేస్తుంది. వాటిపైన ఈ ఆకులను ఆముదంతో వేడి చేసి కట్టులా కడుతుంటే అవి త్వరగా మానుతాయి. గడ్డలు ఉంటే కరిగిపోతాయి. దీంతోపాటు నొప్పులు, వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పుంటి కూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ కూరను తరచూ తింటే రేచీకటి తగ్గుతుంది. కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. దృష్టి దోషంతో బాధపడేవారు తరచూ పుంటి కూరను తింటే మేలు జరుగుతుంది. అలాగే పుంటి కూర మొక్క పూలను దంచి రసం తీసి దాన్ని వడ కట్టి అందులో అర కప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించాలి. దీంతో కూడా రేచీకటి సమస్య తగ్గుతుంది. కంటి చూపు పెరుగుతుంది.
బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. విరేచనాలు అధికంగా అవుతుంటే తెల్ల పుంటి కూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే కట్టుకుంటాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన పుంటి కూరను అన్నంతో తిన్నా విరేచనాలు తగ్గిపోతాయి. దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు ఈ కూరను ఏదో విధంగా తింటే స్వస్థత కలుగుఉంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికి చాలామేలు చేస్తుంది. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాలా మంచిది. పుంటి కూర మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు, వాతం చేసిన వారు పుంటి కూరను తినకూడదు.