Phool Makhana | చూసేందుకు తెలుపు రంగులో పైన నల్లని మచ్చలను కలిగి ఉండే తామర విత్తనాలను మీరు గమనించే ఉంటారు. సూపర్ మార్కెట్లలో సరుకులను ఉంచే చోట ఇవి కనిపిస్తాయి. వీటినే ఫూల్ మఖనా అని కూడా పిలుస్తారు. చాలా మందికి ఈ విత్తనాల గురించి అసలు తెలిసి కూడా ఉండదు. తామర విత్తనాలతో వీటిని తయారు చేస్తారు. వీటనే ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. భారత్‌తోపాటు ఆసియా దేశాల వాసులు ఈ విత్తనాలను అధికంగా వాడుతుంటారు. అయితే ఈ విత్తనాలను చాలా మంది చూసే ఉంటారు. కానీ వీటి గురించి, ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి, వీటిని ఎలా తినాలి.. అన్న వివరాలు చాలా మందికి తెలియవు. పోషకాహార నిపుణులు ఇవే వివరాలను తెలియజేస్తున్నారు. వీటి గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖనాలలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటాయి. కనుక ఫూల్ మఖనాలను తింటే మనకు పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఈ విత్తనాల్లో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత వ్యవస్థకు మేలు చేస్తాయి. గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. పొటాషియం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
ఫూల్ మఖనాలు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు చాలా నెమ్మదిగా గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. దీంతో ఆహారం తిన్న తరువాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఫూల్ మఖనాలు తక్కువ క్యాలరీలను, అధిక మొత్తంలో ఫైబర్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు ఫూల్ మఖనాలను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది.
ఫూల్ మఖనాలు జీర్ణ వ్యవస్థకు సైతం ఎంతో మేలు చేస్తాయి. మలబద్దకాన్ని. అజీర్తిని తగ్గిస్తాయి. ఈ విత్తనాలను తింటే కిడ్నీలకు మేలు జరుగుతుంది. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీ స్టోన్ల సమస్య ఉండదు. ఫూల్ మఖనాలలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా ఈ విత్తనాలను తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఇక వీటిని పెనంపై కాస్త వేయించి నేరుగా అలాగే తినవచ్చు. లేదా కాస్త నెయ్యి, ఉప్పు, మిరియాల పొడి లేదా కారం, చాట్ మసాలా వంటివి వేసి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే బెల్లం లేదా పాలతోనూ కలిపి తీసుకోవచ్చు. ఫూల్ మఖనాలతో కూరలు కూడా చేసుకోవచ్చు. చపాతీలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా వీటితో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.