Papaya | బొప్పాయి పండు మనకు సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా మనకు ఈ పండ్లు లభిస్తాయి. బొప్పాయి పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బొప్పాయి పండ్లను ఉదయం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండ్లను తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు బొప్పాయి పండును తినాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. దీంతో అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
బొప్పాయి పండును ఉదయం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఒక కప్పు మోతాదులో బొప్పాయి పండు ముక్కలను తినాలని వారు అంటున్నారు. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయ పడుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల లభించే విటమిన్ సి దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది.
బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఉదయం తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఇ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. తరచూ బొప్పాయి పండ్లను తింటుంటే చర్మంలో కాంతి పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. అందంగా మారుతారు.
బొప్పాయి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇలా బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.