Paneer | పాలను విరగ్గొట్టి పనీర్ తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి పనీర్‌ను తయారు చేస్తారు. అయితే దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అనేక వంటల్లో వేస్తుంటారు. పనీర్ ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పోషకాలను అందిస్తుంది. పనీర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పనీర్‌ను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. పనీర్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు కూడా పనీర్‌లో ఉంటాయి. మన శరీరం వీటిని తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక పనీర్‌ను తింటే ఈ పోషకాలను పొందవచ్చు. ఇవి కండరాల నిర్మాణానికి, మరమ్మత్తులకు సహాయం చేస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు కావల్సిన ప్రోటీన్లను పనీర్ అందిస్తుంది. ప్రోటీన్లు కావాలనుకునే క్రీడాకారులు సైతం పనీర్‌ను తీసుకుంటారు.
పనీర్ మన శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కనుక ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. దీంతో మన శరీరానికి శక్తి నిరంతరం అందుతూనే ఉంటుంది. అందుకనే క్రీడాకారులు లేదా వ్యాయామం చేసేవారు పనీర్‌ను ఎక్కువగా తింటుంటారు. పనీర్‌ను తినడం వల్ల కండరాలు పటిష్టంగా మారుతాయి. కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. కండరాల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పనీర్‌లో క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పనీర్‌లో ఉండే విటమిన్ డి వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు కూడా దృఢంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
పనీర్‌లో ఉండే క్యాల్షియం పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతగానో మేలు చేస్తుంది. వారి ఎముకలు బలంగా మారేందుకు అవసరం అయిన క్యాల్షియంను అందిస్తుంది. పనీర్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా (27) ఉంటుంది. అందువల్ల పనీర్‌ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. పైగా పనీర్‌లో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం పనీర్‌ను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. దీంతో డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పనీర్‌లో ఉండే ఫాస్ఫరస్, మెగ్నిషియం జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్తేజంగా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. నీరసం, అలసట తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యానికి కూడా పనీర్ మేలు చేస్తుంది. పనీర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. పనీర్‌లో ఉండే పొటాషియం, మెగ్నిషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. బీపీని నియంత్రిస్తాయి. దీంతో హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పనీర్‌లో అనేక రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి1, బి2, బి5, బి6, బి7, బి9, బి12 ఉంటాయి. అలాగే జింక్, సెలీనియం కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి సహాయం చేస్తాయి. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. కనుక పనీర్‌ను తరచూ తింటుండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.