Palm Jaggery | మార్కెట్లో మనకు బెల్లం రకరకాల రూపాల్లో లభిస్తుందన్న విషయం తెలిసిందే. కొత్త బెల్లం, పాత బెల్లం అని సాధారణంగా రెండు రకాలుగా బెల్లాన్ని విక్రయిస్తారు. ఇది రుచి, పోషకాలలో తేడాలను కలిగి ఉంటుంది. అయితే సాధారణ బెల్లం మాత్రమే కాకుండా ప్రస్తుతం తాటి బెల్లంకు కూడా డిమాండ్ పెరిగింది. చాలా మంది దీన్ని వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. తాటిబెల్లాన్ని చాలా మంది చక్కెర, బెల్లంకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని వాడడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. తాటి బెల్లం సాధారణ బెల్లం కన్నా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది. చక్కెర కన్నా కూడా దీన్ని ఎంతో ఆరోగ్యవంతమైనదిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటిబెల్లంలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కనుక మనకు అనేక పోషకాలు లభిస్తాయి.
తాటిబెల్లంలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఈ బెల్లంలో పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని నియంత్రిస్తాయి. అందువల్ల హైబీపీ ఉన్నవారు ఈ బెల్లాన్ని తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. తాటి బెల్లాన్ని తింటే జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. రోజూ భోజనం చేశాక చిన్న తాటి బెల్లం ముక్కను తింటుంటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. తాటి బెల్లం తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. మలబద్దకం నుంచి సైతం బయట పడవచ్చు.
తాటిబెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధులను తగ్గిస్తుంది. తాటిబెల్లం తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని అల్లం లేదా మిరియాల పొడితో తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గొంతు నొప్పి తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. తాటి బెల్లాన్ని ఉదయం తింటే రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. శరీరానికి శక్తి అందుతూనే ఉంటుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసే వారికి ఈ బెల్లం ఎంతగానో మేలు చేస్తుంది.
తాటిబెల్లం మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. కానీ దీన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ బెల్లాన్ని తినవచ్చు. తాటి బెల్లాన్ని తాటి చెట్టు నుంచి తీసిన రసంతో తయారు చేస్తారు. దీని తయారీలో ప్రాసెసింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక చక్కెర, బెల్లంతో పోలిస్తే తాటిబెల్లం ఇంకా ఆరోగ్యకరమైనదని చెప్పవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నొప్పులను తగ్గిస్తాయి. తాటి బెల్లం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ షుగర్ ఉన్నవారు వైద్యుల సూచనతో దీన్ని తినాల్సి ఉంటుంది.