Overripe Bananas | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుక వీటిని అధిక శాతం మంది కొనుగోలు చేసి తింటుంటారు. అయితే అరటి పండ్లను చాలా మంది పూర్తిగా పండ్లుగా మారకుండా కాస్త దోరగా ఉన్నప్పుడే తింటారు. కానీ దోరగా ఉన్న పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లను తింటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల సాధారణ పండ్లలో కన్నా రెట్టింపు మొత్తంలో పోషకాలు లభిస్తాయి. ఇలాంటి పండ్లను తింటే అనేక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను సైతం ఇవి అందిస్తాయి. ఈ క్రమంలోనే బాగా పండిన అరటి పండ్లను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ అరటికాయల కన్నా బాగా పండిన అరటి పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమవుతాయి. చిన్నారులు, వృద్ధులు సైతం ఇలాంటి పండ్లను సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. దీంతో పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బాగా పండిన అరటి పండ్లపై నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఇలాంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. వీటిల్లో విటమిన్ సి, డోపమైన్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల బాగా పండిన పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో దోహదం చేస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.
బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం సైతం అధికంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బాగా పండిన అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటే అసిడిటీ తగ్గిపోతుంది. జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొర రక్షించబడుతుంది. దీంతో కడుపులో మంట, గుండెల్లో మంట, అజీర్తి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. బాగా పండిన అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఒక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సెరొటోనిన్ ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మూడ్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేస్తుంది. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు.
బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో ఉండే చక్కెరలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. దీంతో తక్షణమే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. ఉత్తేజంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట నుంచి వెంటనే బయట పడవచ్చు. ఇక బాగా పండిన అరటి పండ్లను తినేటప్పుడు లోపలి గుజ్జులో ఎలాంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. మరీ అతిగా పండిన అరటి పండు నుంచి మురిగిన వాసన వస్తుంది. అలాంటి పండ్లను తినకూడదు. అరటి పండుపై ఒక మాదిరిగా మచ్చలు ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. మరీ అతిగా మచ్చలు ఉండకూడదు. అవి లోపల కుళ్లిపోయి ఉండే అవకాశం ఉంటుంది. ఇలా బాగా పండిన అరటి పండ్లను తెచ్చుకుని తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.