Orange Peel Tea | నారింజ పండ్లను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నారింజ పండ్లను కొందరు నేరుగా తింటే, కొందరు జ్యూస్‌లా తయారు చేసి తీసుకుంటారు. అయితే నారింజ పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. నారింజ పండు తొక్కలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నారింజ పండ్లను తిన్న వెంటనే తొక్కను పడేస్తారు. కానీ ఆ తొక్కలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఇకపై నారింజ పండ్లను తింటే తొక్కను మాత్రం పడేయకండి.
నారింజ పండు తొక్కలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, లైమోనీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ సంబంధ వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నారింజ పండు తొక్కలతో తయారు చేసిన టీని తాగితే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో చర్మ కణాలు పునరుత్తేజం చెందుతాయి. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు. కాంతివంతంగా చర్మం మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. నారింజ పండు తొక్కలను పేస్ట్‌లా చేసి పలు రకాల ఫేస్ ప్యాక్‌లలోనూ ఉపయోగించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
నారింజ పండు తొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ తొక్కల్లో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో శరీరం సీజనల్ వ్యాధులపై పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్లు, ఇతర రోగాల నుంచి బయట పడవచ్చు. నారింజ పండు తొక్కల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీని వల్ల హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
నారింజ పండు తొక్కలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. నారింజ పండు తొక్కలతో తయారు చేసే టీని సేవిస్తుంటే శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు సైతం తగ్గిపోతాయి. నారింజ పండు తొక్కల టీ తాగితే ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. శ్వాసమార్గాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా ఆడుతుంది. రాత్రి పూట ఈ టీని సేవిస్తుంటే గురక సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఈ తొక్కలతో తయారు చేసిన టీని రోజూ తాగుతుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. ఇలా ఈ తొక్కలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.