Cloves Benefits | లవంగాలు మన వంటి దినుసుల్లో ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. లవంగాలను మనం తరచూ మసాలా వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఆయుర్వేద పరంగా లవంగాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత రోజూ ఒక లవంగాన్ని తింటే ఎంతో లాభం కలుగుతుంది. లవంగాల వల్ల పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫినోలిక్ సమ్మేళనాలు, యూజినల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిపై పనిచేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కణాలు రక్షించబడతాయి. ఫ్రీ ర్యాడికల్స్ నాశనమవుతాయి.
లవంగాలను తినడం వల్ల మన శరీరంలో అనేక జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వికారం, కడుపు ఉబ్బర, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం కార్మినేటివ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది పొట్టలో అసౌకర్యంతోపాటు కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
లవంగాల్లోని యూజినాల్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల లవంగాలను తరచూ తింటుంటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలను తినడం వల్ల మొటిమలు సైతం తగ్గుతాయి. సోరియాసిస్ ఉన్నవారు లవంగాలను తింటుంటే ఫలితం ఉంటుంది.
లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం లివర్‌ను టాక్సిన్ల బారి నుంచి రక్షిస్తుంది. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. యూజినాల్ వల్ల లివర్ వ్యాధులు సైతం తగ్గుతాయి. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి లివర్ వ్యాధులు తగ్గుతాయి. లవంగాలను రోజూ తింటుంటే లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
లవంగాల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలను తినడం వల్ల నోట్లోని బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం యాంటీ సెప్టిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల చిగుళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
లవంగాలను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం. వీటిని తింటే ఎముకలు కూడా ఆరోగ్యంగా మారుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. కనుక లవంగాలను రోజూ తినాల్సి ఉంటుంది. భోజనం అనంతరం ఒక చిన్న లవంగాన్ని నమిలినా చాలు, అనేక ప్రయోజనాలను పొందవచ్చు.