Oats | మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. గుండె పంప్ చేసే రక్తం వల్ల మన శరీరంలోని అవయవాలకు సక్రమంగా ఆక్సిజన్, పోషకాలు రవాణా అవుతాయి. అయితే బీపీ పెరగడం, పలు ఇతర కారణాల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక బీపీ ఉన్నా లేకపోయినా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాల విషయంలో అనేక మార్పులు చేసుకోవాలి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఓట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఓట్స్‌ను ఉదయం ఉప్మా లాగా చేసి తినవచ్చు. లేదంటే పాలు పోసి కలిపి ఓట్ మీల్లా చేసి తినవచ్చు. ఓట్స్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఓట్స్‌ను నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని పలు రకాలుగా తయారు చేసి తినవచ్చు. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలను పొందవచ్చు.
ఓట్స్‌ను కాస్త ఉడకబెట్టి వాటిల్లో పలు రకాల పండ్ల ముక్కలను కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బెర్రీలు, అరటి పండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీలు, కివిలు వంటి పండ్లను ముక్కలుగా చేసి ఓట్స్‌తో కలిపి తింటే రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను పొందవచ్చు. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఓట్స్‌ను ఉడకబెట్టి వాటి మీద బటర్ వేసి కూడా తినవచ్చు. ఆల్మండ్ బటర్, పీనట్ బటర్, కాజు బటర్ ఈ కోవకు చెందుతాయి. ఇవి క్రీమీ టెక్చర్‌ను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కనుక మనకు హాని చేయవు. వీటిని ఓట్స్‌తో కలిపి తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
ఓట్స్‌తో కలిపి డార్క్ చాకొలెట్‌ను కూడా తినవచ్చు. డార్క్ చాకొలెట్లలో కొకొవా అధికంగా ఉంటుంది. ఇది రుచిగా ఉండడమే కాదు అనేక యాంటీ ఆక్సిడెంట్లను మన శరీరానికి అందజేస్తుంది. ఓట్స్‌ను ఉడకబెట్టి డార్క్ చాకొలెట్లతోనూ కలిపి తినవచ్చు. దీంతో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదేవిధంగా ఓట్స్‌పై మన వంట ఇంట్లో ఉండే మసాలా దినుసులను చల్లి కూడా తినవచ్చు. దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు, లవంగాలు వంటి వాటిని పొడి చేసి ఓట్స్‌పై చల్లి తింటే చెప్పలేనన్ని లాభాలు కలుగుతాయి. ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు హైబీపీని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు రకాల ఆహారాలను ఓట్స్‌తో కలిపి తింటే అనేక లాభాలను పొందవచ్చు. గుండెను సంరక్షించుకోవచ్చు.