Neem Fruit | వేప చెట్టు లేని ఊరిలో అసలు ఉండకూడదు.. అని మన పూర్వీకులు చెబుతుండేవారు. ఎందుకంటే ఆయుర్వేద ప్రకారం వేప అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టులోని ప్రతి భాగం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే మన పెద్దలు వేప చెట్టు గురించి అంత గొప్పగా చెబుతుండేవారు. వేప చెట్టుకు చెందిన ఆకులు, బెరడు, పువ్వులు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాగే వేప పండ్లు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వేప పండ్ల నుంచి నూనెను తీసి ఉపయోగిస్తుంటారు. వేప పండ్లను కొందరు ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో తింటారు. వే పండ్లను నేరుగా తింటే చేదుగా ఉంటాయి. కనుక వాటిని ఎండ బెట్టి తినవచ్చు. వేప పండ్లను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
వేప పండ్లలో యాంటీ వార్మ్ గుణాలు ఉంటాయి. అంటే పొట్టలో నులి పురుగులు ఉన్నవారు ఈ పండ్లను తింటే ఆ పురుగులు నశిస్తాయి. వేప పండ్లలో ఉండే సమ్మేళనాలు పొట్టలో ఉండే పురుగులను చంపేస్తాయి. దీంతో నులి పురుగుల సమస్య నుంచి బయట పడవచ్చు. పెద్దలకే కాదు ఈ చిట్కా పిల్లలకు కూడా మేలు చేస్తుంది. వేప పండ్లలో యాంటీ మలేరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తీసుకుంటే మలేరియా నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ పండ్లలో ఉండే సమ్మేళనాలు మలేరియాకు కారణం అయ్యే క్రిములను చంపేస్తాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. వేప పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
వేప పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలపై పడే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలు సురక్షితంగా ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వేప పండ్ల గుజ్జును రాస్తుంటే ఎలాంటి చర్మ సమస్యలు అయినా ఇట్టే తగ్గిపోతాయి. గజ్జి, తామరతోపాటు చర్మంపై వచ్చే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. వేప పండ్లలో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వేప పండ్లు అందుబాటులో లేకపోతే వాటి నుంచి తీసిన నూనెను కూడా చర్మ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు.
వేప పండ్లను తింటుంటే జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు జరుగుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం నుంచి బయట పడతారు. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు వేప పండ్లలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వేప పండ్లను రోజూ తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీంతో రక్త సంబంధ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. వేప పండ్లలో సహజసిద్ధమైన ఇన్సెక్టిసైడల్ గుణాలు ఉంటాయి. అంటే ఈ పండ్ల ద్వారా పురుగులు, క్రిమి కీటకాలను నాశనం చేయవచ్చు. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి ఈ పండ్లు సహజసిద్ధమైన ఎరువుగా, పోషక పదార్థంగా ఉపయోగపడతాయి. దీంతో పంటను నాశనం చేసే పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. అలాగే పంటకు పోషణ లభించి దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇలా వేప పండ్లతో అనేక లాభాలను పొందవచ్చు.