Moong Sprouts | రోజూ ఉదయం మనం అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తింటుంటాం. ఇడ్లీ, దోశ, పూరీ ఇలా వెరైటీ టిఫిన్లను తింటాం. అయితే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు పలు ఆరోగ్యవంతమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో మనం అధికంగా ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యవంతమైన ఆహారాలను తింటే పోషణ లభించడమే కాదు, శరీరానికి శక్తి అందుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. అలాగే రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తినాల్సిన ఆరోగ్యవంతమైన ఆహారాల్లో మొలకెత్తిన పెసలు కూడా ఒకటి. వీటినే మొలకలు అని కూడా అంటారు. వీటిని ఉదయం తింటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఉదయం మొలకెత్తిన పెసలను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పెసలను తింటే వృక్ష సంబంధమైన ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానికి, మరమ్మత్తులకు ఎంతగానో దోహదపడతాయి. ఉదయం మొలకలను తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండవచ్చు. ఉత్తేజంగా పనిచేస్తారు. బద్దకం లేకుండా ఉంటుంది. ఎంత పనిచేసినా అలసిపోరు. పెసలను తినడం వల్ల పలు ఎంజైమ్‌లు మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. దీంతో మన శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. రోజూ సుఖ విరేచనం కలుగుతుంది. పెసలను తింటే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి కూడా బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది.
పెసలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి. పెసలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. పెసలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు పెసలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పెసలను రోజూ తినడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి.
పెసలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెసలలో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో రక్త సరఫరా నియంత్రణలోకి వస్తుంది. బీపీ తగ్గుతుంది. హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన పెసల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటిని తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు రోజూ మొలకలను తింటుంటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. మొలకలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. ఇలా పెసలను మొలకెత్తించి తింటే అనేక లాభాలను పొందవచ్చు.