Mint Leaves | వేసవి కాలం ప్రారంభం అయినప్పటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. దీంతో ఓ వైపు ఎండలు మండిపోతూ ఉంటాయి. మరోవైపు వేసవి తాపం పెరుగుతుంది. వేసవి మనకు అనేక అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. ఈ సీజన్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శరీరంలో ద్రవాలు అన్నీ ఖర్చయిపోతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఎండలో తిరిగితే ఎండ దెబ్బ బారిన కూడా పడతారు. కనుక వేసవి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలే కాకుండా శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇలాంటి వాటిల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుదీనా. పుదీనా ఆకులు ఎంతో తాజాదనాన్ని అందిస్తాయి. ఇవి మనకు చల్లదనాన్ని అందిస్తాయి. అందుకనే చాలా మంది వేసవిలో తలకు పెట్టుకునే షాంపూలతోపాటు జుట్టుకు రాసుకునే ఆయిల్స్ కూడా పుదీనా ఉన్నవి వాడుతుంటారు. అయితే ఈ సీజన్లో పుదీనా నీళ్లను తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పుదీనా ఆకులను రాత్రంతా నీటిలో వేసి అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ నీళ్లను తాగాలి. లేదా పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్ని చల్లని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇక పుదీనా ఆకులను నేరుగా నమిలి తినవచ్చు లేదా రసం కూడా తీసుకోవచ్చు. ఇలా పుదీనాను అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. పుదీనా జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనా ఆకులకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. కనుక జీర్ణ వ్యవస్థలో ఉండే మంట తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనాను తీసుకుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా రోజంతా ఎండలో తిరిగే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. పుదీనా ఆకులను నమలడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనా ఆకులను వేసి మరిగించిన నీళ్లను తాగితే ఆ వాసనకు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
పుదీనా ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుంటుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పుదీనా ఆకులను వేసి మరిగించిన నీళ్లను తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా పుదీనా మేలు చేస్తుంది. ఈ ఆకులను నమిలి తింటున్నా లేదా నీళ్లను తాగుతున్నా దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాస సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది. ఇలా పుదీనా ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.