Jaggery With Ghee | ఆయుర్వేద ప్రకారం నెయ్యి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆయుర్వేదంలో పలు కర్మ చికిత్సలను నిర్వహించడంలో నెయ్యి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెయ్యిలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అయితే నెయ్యిని బెల్లంతో కలిపి తింటే అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బెల్లంలోనూ అనేక పోషకాలు ఉంటాయి. కనుక ఈ రెండింటి కాంబినేషన్ మనకు అనేక లాభాలను ఇస్తుందని వారు అంటున్నారు. బెల్లం ముక్కను నెయ్యితో కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాల్సి ఉంటుంది. దీంతో పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి అమితమైన పోషణ లభిస్తుంది. బలం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ మిశ్రమం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బెల్లం, నెయ్యి రెండింటి మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ మిశ్రమం జీర్ణాశయ ఎంజైమ్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత వచ్చే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సైతం తగ్గిపోతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాక అందులో ఉండే పోషకాలను కూడా శరీరం సులభంగా శోషించుకుంటుంది. నెయ్యి, బెల్లం మిశ్రమం సహజసిద్ధమైన డిటాక్సిఫై ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుందన్నమాట. దీంతోపాటు లివర్, కిడ్నీలు, రక్తం అన్నీ శుభ్రమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే టాక్సిన్లు సులభంగా బయటకు వెళ్లి ఆరోగ్యం కలుగుతుంది.
నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని ఉదయం తినడం వల్ల చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. అసలు అలసట, నీరసం రావు. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల శరీర మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పోషకాహార లోపం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఫలితం ఉంటుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు ఈ రెండింటి మిశ్రమాన్ని తింటుంటే హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. శరీర ఉష్ణోగ్రత సైతం నియంత్రణలో ఉంటుంది.
బెల్లం, నెయ్యి మిశ్రమాన్ని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్, అధిక ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అసిడిటీ, అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ రెండింటి మిశ్రమంలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలకు బలం కలుగుతుంది. ఇలా బెల్లం, నెయ్యి మిశ్రమం మనకు అనేక లాభాలను అందిస్తుంది. కనుక దీన్ని రోజూ తినడం మరిచిపోకండి.