Honey And Black Pepper | తేనె, మిరియాలను మనం తరచూ అనేక ఆహారాల్లో ఉపయోగిస్తుంటాం. మిరియాలను రసం లేదా చారు, ఇతర వంటకాల్లో వేస్తుంటారు. తేనెను కూడా తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్ చాలా శక్తివంతమైంది. ఇది అనేక వ్యాధులను తగ్గిస్తుంది. తేనె, మిరియాల పొడి కాంబినేషన్‌ను రోజూ ఉదయం, సాయంత్రం 2 సార్లు 1 టీస్పూన్ చొప్పున తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ మిరియాల పొడిని కలపాలి. ఇలా రోజుకు 2 సార్లు తీసుకోవాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఆ నీళ్లను అయినా తాగవచ్చు. ఇలా తేనె, మిరియాల పొడిని కలిపి రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
తేనె, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే సహజసిద్ధమైన డిమల్సెంట్గా పనిచేస్తుంది. ఇది గొంతు సమస్యలను తగ్గిస్తుంది. గొంతులో ఉండే గరగర, నొప్పి, మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ మిశ్రమం ఎక్స్పెక్టొరెంట్గా కూడా పనిచేస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దీంతో దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మిరియాల పొడి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఈ మిశ్రమం ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని తింటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
తేనె, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో శరీరంలో కొవ్వు కణాలు కరిగిపోతాయి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. సన్నగా నాజూగ్గా మారుతారు. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. తేనె, మిరియాల పొడి మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. ఈ మిశ్రమంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
తేనె, మిరియాల పొడి మిశ్రమంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. తేనె, మిరియాల పొడి మిశ్రమం మనకు ఆరోగ్యకరమే అయినప్పటికీ కొందరికి ఇది పడదు. అసిడిటీని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు ఈ మిశ్రమాన్ని తీసుకోకూడదు. ఇక ఈ మిశ్రమాన్ని మోతాదులోనే తినాలి. అధికంగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు.