Green Color Foods | ఆకుకూరలు, కూరగాయలతోపాటు పలు ఇతర ఆహారాలు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాలను పోషకాలకు గనిగా చెబుతుంటారు. ఈ ఆహారాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాల్లో క్లోరోఫిల్ అనే వర్ణ ద్రవ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకనే అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అయితే ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మన శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేలా చూస్తాయి. మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాల్లో పాలకూర ఒకటి. ఇందులో ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్, లుటీన్ అధికంగా ఉంటాయి. పాలకూరను తింటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. పాలకూరలో ఉండే విటమిన్ కె, క్యాల్షియం ఎముకలకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. అలాగే ఆకుపచ్చని ఆహారాల్లో బ్రోకలీ కూడా ఒకటి. ఇది చూసేందుకు అచ్చం కాలిఫ్లవర్ లా ఉంటుంది. కానీ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు సి, కెలతోపాటు ఫైబర్, సల్ఫొరాఫేన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
అవకాడోలు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిల్లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అలాగే వీటిల్లో పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అవకాడోలను తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ టీని కూడా రోజూ తీసుకోవాలి. ఇందులో పాలిఫినాల్స్, ఎల్-థియానైన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల గ్రీన్ టీని సేవిస్తుంటే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇక ఆకుపచ్చ రంగులో ఉండే బీన్స్, అదే రంగులో ఉండే అలసందలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిల్లో ఫైబర్‌తోపాటు విటమిన్లు కె, సి, మాంగనీస్ అధికంగా ఉంటాయి. కనుక వీటిని తింటే పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే సిలికాన్ వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కివి పండ్లను కూడా తినవచ్చు. ఇవి కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్లు సి, కె, ఫైబర్, సెరొటోనిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఏర్పడదు. నిద్ర లేమి తగ్గుతుంది. పడుకున్న వెంటనే గాఢంగా నిద్రిస్తారు. ఇలా ఆకు పచ్చ రంగులో ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.