Ginger Water | భారతీయులు ఎంతో కాలం నుంచి అల్లంను తమ రోజువారి ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా మసాలా వంటకాలను చేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే అల్లం టీ పెట్టుకుని కూడా తాగుతుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అల్లాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ ఉదయం పరగడుపునే తాగుతుండాలి. చాలా మంది ఉదయం కాఫీ, టీలను సేవిస్తుంటారు. వాటికి బదులుగా అల్లం నీళ్లను తాగాలి. ఇలా అల్లం నీళ్లను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను తగ్గించడంలో, శరీరాన్ని రక్షించడంలో అల్లం నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయం అల్లం నీళ్లను తాగుతుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలో రక్తనాళాలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. అల్లం నీళ్లను రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా అల్లం ఎంతగానో పనిచేస్తుంది. అల్లం నీళ్లను రోజూ తాగుతుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో అల్లం ఎంతగానో పనిచేస్తుంది. అల్లం నీళ్లను రోజూ తాగుతుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది. వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అయి కణాలు రక్షించబడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా అల్లం నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొందరికి అల్లం ఘాటు పడదు. దీన్ని తాగలేరు. అలాంటి వారు అల్లం నీటిలో తేనె కలిపి తాగవచ్చు. ఇలా రోజూ అల్లం నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.