Fennel Seeds Water | భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొందరికి ఉంటుంది. సోంపు గింజలను తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, నోరు కూడా ఫ్రెష్‌గా మారుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. అయితే సోంపు గింజలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక రోజూ ఈ గింజలను భోజనం చేసిన అనంతరం తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పలు ఔషధాల తయారీలోనూ ఈ గింజలను ఉపయోగిస్తుంటారు. అయితే సోంపు గింజలతో నీళ్లను తయారు చేసి కూడా తాగవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కావల్సినన్ని సోంపు గింజలను వేసి నీళ్లను బాగా మరిగించాలి. తరువాత వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్నే సోంపు గింజల టీ అని కూడా పిలుస్తారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీని రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
సోంపు గింజల టీని సేవించడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. సోంపు గింజల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే పొట్టలో ఉండే అసౌకర్యం మొత్తం పోతుంది. ముఖ్యంగా కొందరికి అతిగా భోజనం చేశాక ఈ అసౌకర్యం ఏర్పడుతుంది. అలాంటి వారు సోంపు గింజల టీని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. దీంతో లైట్‌గా మారుతారు. సోంపు గింజల టీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ డ్రింక్‌ను తాగితే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. పైగా ఈ డ్రింక్‌ను సేవిస్తే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్న వారు రోజువారి ఆహారంలో సోంపు గింజల నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది.
సోంపు గింజల నీళ్లు సహజసిద్ధమైన డై యురెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల ఈ నీళ్లను తాగితే శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. దీంతో వాపులు తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు గింజల నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి తగ్గిపోతాయి. రోగాల నుంచి రక్షణ లభించి ఆరోగ్యంగా ఉంటారు. సోంపు గింజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. సోంపు గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి సోంపు గింజల నీళ్లు ఒక వరం అనే చెప్పవచ్చు. ఈ నీళ్లను రోజుకు 2 పూటలా సేవిస్తుంటే మెటబాలిజం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే స్త్రీలకు రుతు సమయంలో ఉండే నొప్పులను తగ్గించడంలోనూ ఈ నీళ్లు పనిచేస్తాయి. ఈ నీటిలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల స్త్రీలు రుతు సమయంలో నొప్పులు మరీ అధికంగా ఉంటే ఈ నీళ్లను తాగవచ్చు. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం సైతం తగ్గిపోతుంది. సోంపు గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గి నోరు ఫ్రెష్‌గా మారుతుంది. రోజూ సోంపు గింజల నీళ్లను తాగుతుంటే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా సోంపు గింజల నీళ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి.