Pears | బయట మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. చాలా మంది సహజంగానే యాపిల్, అరటి పండ్లు, ఇతర పండ్లను అధికంగా తింటుంటారు. అయితే మనకు ఎప్పటినుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్న పండ్లను మాత్రం చాలా మంది అంతగా పట్టించుకోరు. అలాంటి పండ్లలో పియర్స్ పండ్లు కూడా ఒకటి. ఇవి ఆకుపచ్చ లేదా పసుపు రంగులో దర్శనమిస్తుంటాయి. పియర్స్ పండ్లు మనకు ఎంతో కాలం నుంచే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పండ్లను చాలా మంది తినరు. లేదా తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. ఇవి కాస్త తియ్యగా, చప్పగా ఉంటాయి. కనుకనే ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. అయితే పియర్స్ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలు లభించడమే కాదు, పలు వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ పండ్లను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు.
పియర్స్ పండ్లలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ అనే రెండు రకాల ఫైబర్లను మనం పియర్స్ పండ్ల ద్వారా పొందవచ్చు. ఇవి షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి శరీరంలో రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. పియర్స్ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.
పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. పియర్స్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
పియర్స్ పండ్లలో సార్బిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. అంటే పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పియర్స్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను సంరక్షిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. వీటి వల్ల వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. పియర్స్ పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కొల్లాజెన్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది. చర్మం నిగారింపును పొందుతుంది. ఇలా పియర్స్ పండ్లను తరచూ తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.