Mushrooms | ఒకప్పుడంటే పుట్టగొడుగులు కేవలం వర్షాకాలం సీజన్లోనే లభించేవి. కానీ ఇప్పుడు మనం వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని తెచ్చి వండుకోవచ్చు. ఈ క్రమంలోనే పుట్టగొడుగులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతమనే చెప్పాలి. వీటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం పుట్టగొడుగులను తినడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలోని పెన్ స్టేట్ సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రొడక్ట్స్ సైంటిస్టులు అధ్యయనం చేసి చెప్పారు. కనీసం 5 పుట్టగొడుగులను తిన్నా చాలు, ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.
పుట్టగొడుగులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. ముఖ్యంగా వీటిల్లో రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి.. ఎర్గోథియోనియెన్, గ్లూటా థియోన్. అందువల్ల పుట్టగొడుగులను తింటే తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని ఫుడ్ కెమిస్ట్రీ అనే జర్నల్‌లోనూ ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. రోజుకు 5 పుట్టగొడుగులను ఏదో ఒక రకంగా తింటే చాలని, దీంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. పుట్ట గొడుగులను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిదట. ఉదయం కోడిగుడ్డు ఆమ్లెట్ లేదా ఉప్మాలో కలిపి వీటిని తింటే మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇక మధ్యాహ్నం లేదా రాత్రి డిన్నర్ సమయంలోనూ పుట్ట గొడుగులను తినవచ్చు. వీటిని కూరగా చేసి తీసుకోవచ్చు. పుట్టగొడుగులను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పుట్టగొడుగులను తినడం వల్ల బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం లభిస్తాయి. అలాగే వీటిల్లో విటమిన్ డి కూడా ఉంటుంది. దీంతోపాటు పొటాషియం కూడా వీటిల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండెను, మెదడును, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక పుట్ట గొడుగులను తరచూ తింటుండాలి.
పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిని తినడం వల్ల విటమిన్ డి, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ డి మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియాన్ని శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి12 వల్ల నాడీ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మెడ, భుజాల నొప్పి ఉన్నవారు పుట్టగొడుగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇలా పుట్టగొడుగులను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.