Papaya | బొప్పాయి పండు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నారింజ రంగులో ఉండే ఈ పండు తియ్యగా ఉంటుంది. అందుకనే బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పండును ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్స్‌గా పిలుస్తారు. బొప్పాయి పండు ఎంతో తియ్యనైన రుచిని కలిగి ఉంటుంది. ఇది కేవలం తియ్యగా ఉండడమే కాదు మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. బొప్పాయి పండులో విటమిన్లు ఎ, సి, ఇ లతోపాటు అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. అందువల్ల ఈ పండును తింటే మనకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. బొప్పాయి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. కనుక ఈ పండ్లను ఎప్పుడైనా సరే తినవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
బొప్పాయి పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేసి జీర్ణశ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ ఈ పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గడంలో ఎంతో సహాయం చేస్తాయి. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి బొప్పాయి పండ్లు గొప్ప వరమని చెప్పవచ్చు. ఈ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే బరువును తగ్గించుకుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బొప్పాయి పండ్లలో అనేక విటమిన్లతోపాటు పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. బొప్పాయిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరంలోని వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ బొప్పాయి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా చేసి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
బొప్పాయి పండ్లలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్లు ఎ, సి చర్మాన్ని సంరక్షిస్తాయి. బొప్పాయి పండ్లను తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా తయారవుతుంది. చర్మానికి తేమ లభిస్తుంది. చలికాలంలో చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఇలా బొప్పాయి పండ్లను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తినడం మరిచిపోకండి.