Chickpeas | సాయంత్రం పూట చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అనేక రకాల చిరుతిళ్లను తింటుంటారు. పానీ పూరీ, బజ్జీలు, పునుగులు లేదా బేకరీ ఐటమ్స్‌ను తింటుంటారు. కొందరు సమోసాలను కూడా లాగించేస్తారు. కొందరు బిస్కెట్లను తింటారు. అయితే రోజూ వీటిని తినడం అంత మంచిది కాదు. ఆరోగ్యానికి ఇవన్నీ హాని చేస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్ వస్తుంది. గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ ఫుడ్స్‌ను అసలు తినకూడదు. మరి సాయంత్రం ఆకలి అయితే ఏం చేయాలి.. అంటే.. ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తినాలి. ఈ జాబితాలో నల్ల శనగలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నల్ల శనగలను రోజూ నీటిలో కాసేపు నానబెట్టి అనంతరం వాటిని ఉడికించి తినవచ్చు. ఇలా నల్ల శనగలను తింటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నల్ల శనగలపై పచ్చి ఉల్లిపాయలు చల్లి నిమ్మకాయ పిండి, ఉప్పు, కారం చల్లి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
నల్ల శనగలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినలేని వారు ప్రోటీన్ల కోసం నల్ల శనగలను తినవచ్చు. పైగా ఇవి ధర తక్కువ. ఒక కప్పు నల్ల శనగలను తింటే చాలు సుమారుగా 15 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఇవి కండరాలను నిర్మాణం చేస్తాయి. కణజాలం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేస్తారు. నల్ల శనగల పొట్టులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ శనగలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనలో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు లేదా బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్న వారు రోజూ నల్ల శనగలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.
నల్ల శనగల్లో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నల్ల శనగలను రోజూ తింటుంటే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీని వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నల్ల శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. నల్ల శనగలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు.
నల్ల శనగల్లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. ఈ శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీ తగ్గేలా చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నల్ల శనగల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిని తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. నల్ల శనగల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫలితంగా రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ విధంగా నల్ల శనగలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.