Sun Flower Seeds | నిత్యం ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం లేదు. ఎంత సేపు బయట లభించే జంక్ ఫుడ్‌ను లేదా ఇతర తినుబండారాలను తినేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిని తింటే అప్పటికప్పుడు ఏమీ కాకపోయినా దీర్ఘకాలంలో మాత్రం అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. కనుక ఆరోగ్యవంతమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. మీకు ఆకలిగా అనిపించినప్పుడు జంక్ ఫుడ్‌ను తినే బదులు విత్తనాలను తినవచ్చు. మరీ ముఖ్యంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. పొద్దు తిరుగుడు విత్తనాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. రోజూ గుప్పెడు మోతాదులో ఈ విత్తనాలను తినాలి. 1 టీస్పూన్ మోతాదులో ఈ విత్తనాలను తింటేనే మనకు 25 క్యాలరీల శక్తి లభిస్తుంది. 1 గ్రాము ప్రోటీన్లు, 1 గ్రాము కార్బొహైడ్రేట్లు, 0.5 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల కొవ్వులు, 1.2 మిల్లీగ్రాముల విటమిన్ ఇ, 4 మిల్లీగ్రాముల మెగ్నిషియం, 0.2 మిల్లీగ్రాముల జింక్, 2 మైక్రోగ్రాముల సెలీనియం, 0.2 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు తదితర పోషకాలను సమృద్ధిగా పొందవచ్చు. ఇవన్నీ మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి.
పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తాయి. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ బి6, మెగ్నిషియం జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏకాగ్రతను కలిగిస్తాయి. దీంతో ఏ విషయంపై అయినా సరిగ్గా దృష్టి పెట్టగలుగుతారు. అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారికి పొద్దు తిరుగుడు విత్తనాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ విత్తనాలను రోజూ తింటుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఈ విత్తనాల్లో జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుంటా ఉంటాయి. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. ఇలా పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.