Cherry Fruits | చెర్రీ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. చెర్రీ పండ్లను స్వీట్లు లేదా కేకులపై పెట్టి ఇస్తుంటారు. కేవలం ఆ సమయంలో మాత్రమే ఈ పండ్లను తింటుంటారు. అయితే వాస్తవానికి తీపిగా ఉన్నప్పటికీ ఈ పండ్ల ద్వారా మనకు లభించే క్యాలరీలు చాలా తక్కువే. చెర్రీ పండ్లను రోజువారి ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చెర్రీ పండ్లతో అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. చెర్రీ పండ్లలో మన శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు రోగాలు రాకుండా చూస్తాయి. శరీరానికి పోషణను అందిస్తాయి. దీంతో పోషకాహార లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.
చెర్రీ పండ్లు మనకు మార్కెట్లో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా వేసవి సీజన్లో వస్తాయి. ఈ సీజన్లో మనకు బయట రహదారుల పక్కన బండ్లపై ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందువల్ల ఈ పండ్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని తినవచ్చు. ఇక చెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్లే ఈ పండ్లు అంత ఎర్రని రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందువల్ల చెర్రీ పండ్లను తింటుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారికి చెర్రీ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లను రోజూ తింటుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గౌట్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
చెర్రీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం, ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. పొటాషియం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. చెర్రీ పండ్ల ద్వారా మనకు మెలటోనిన్ అనే హార్మోన్ సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. కనుక రాత్రి పూట చెర్రీ పండ్లను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను తాగినా చక్కగా నిద్రపోవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శారీరక శ్రమ నుంచి త్వరగా రికవరీ అవుతారు. మళ్లీ చురుగ్గా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. చెర్రీ పండ్లలో గుండెకు ఎంతగానో మేలు చేసే అనేక సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ పండ్లలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె సంబంధ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇలా చెర్రీ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.