Curry Leaves | కరివేపాకులను మనం నిత్యం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. వంటకాల్లో వచ్చే కరివేపాకులను దాదాపుగా చాలా మంది తినరు. పడేస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్రకారం చూస్తే కరివేపాకు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీని రుచి కారణంగా చాలా మంది దీన్ని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఈ ఆకులను తినకుండా విడిచిపెట్టలేరు. కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు. లేదా కరివేపాకుల రసాన్ని రోజూ నీటిలో కలిపి తాగవచ్చు. ఉదయం పరగడుపునే గుప్పెడు కరివేపాకులను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. ఇలా కరివేపాకులను ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
కరివేపాకుల్లో ఆల్కలాయిడ్స్, మహానింబిన్, ముర్రాయనోల్, గ్లైకోసైడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు తదితర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్లు ఎ, బి, సి, ఇ కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులు తగ్గుతాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ సంబంధ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకులను తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్ లు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
కరివేపాకులలో యాంటీ హైపర్ గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. అంటే ఇవి షుగర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయన్నమాట. కరివేపాకులను తింటుంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కరివేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. రోజూ కరివేపాకులను పరగడుపునే తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. కరివేపాకులలో ఉండే ఫైటో స్టెరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కరివేపాకులను తింటున్నా లేదా నేరుగా జుట్టుకు హెయిర్ ప్యాక్‌లా అప్లై చేస్తున్నా శిరోజాలు రాలడం తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగి దృఢంగా మారుతుంది. అయితే హెయిర్ ప్యాక్‌లా వాడితే చుండ్రు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. సహజసిద్ధమైన నిగారింపు శిరోజాలకు వస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం తగ్గుతుంది. కరివేపాకులను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు మంచు గడ్డలా కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు లేదా బరువు నియంత్రణలో ఉండాలి అనుకునే వారు రోజూ కరివేపాకులను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇలా కరివేపాకులను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.