Cow Peas | ఏదైనా పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది గారెలు తయారు చేసి తింటుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటి వాటితో గారెలను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాలకు చెందిన వారు వీటినే వడలు అని కూడా పిలుస్తారు. అయితే గారెల తయారీకి ఎంచుకునే పప్పును బట్టి గారెల రుచి మారుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది బొబ్బర్లను గారెలకు ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే బొబ్బర్లను వాస్తవానికి ఉడకబెట్టి రోజూ తినవచ్చు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బొబ్బర్లను ఉడకబెట్టి రోజూ ఒక కప్పు మోతాదులో స్నాక్స్ రూపంలో తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి పలు వ్యాధులను నయం చేస్తాయని వారు అంటున్నారు.
బొబ్బర్లలో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినలేని వారు బొబ్బర్లను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాలకు శక్తిని అందిస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. కండరాల నిర్మాణం జరుగుతుంది. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం అధికంగా చేసేవారు బొబ్బర్లను తింటుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. దీంతో మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. బొబ్బర్లను ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటే చాలు ఏకంగా 13 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. కనుక ప్రోటీన్లకు వీటిని చక్కని వనరుగా చెప్పవచ్చు.
బొబ్బర్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గేలా చేస్తుంది. బొబ్బర్లను ఆహారంలో భాగం చేసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు కచ్చితంగా బొబ్బర్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. బొబ్బర్లలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
బొబ్బర్ల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. అందువల్ల మధుమేహం ఉన్నవారు సైతం బొబ్బర్లను నిరభ్యంతరంగా తినవచ్చు. పైగా వీటిలో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. బొబ్బర్లలో ఫోలేట్ (విటమిన్ బి9) అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేసే పోషక పదార్థం. దీంతో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా నివారించవచ్చు. శిశువుల్లో రక్తహీనత వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. బొబ్బర్లను ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూస్తాయి. ఇలా బొబ్బర్లను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.