Coconut Oil | కొబ్బరినూనెను చాలా మంది జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. కొబ్బరినూనె శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినూనెను రాయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. శిరోజాలు సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుంటాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం నుంచి బయట పడవచ్చు. శిరోజాలకు చక్కని పోషణ లభించి ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. అయితే వాస్తవానికి కొబ్బరినూనె మనకు కేవలం శిరోజాల సంరక్షణకే కాదు, పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు కూడా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాల వాసులు కొబ్బరినూనెను సేవిస్తుంటారు. కొబ్బరినూనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను పొందవచ్చు. పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
బాగా పండిన కొబ్బరి నుంచి నూనెను తీస్తారు. కొబ్బరికాయలు వాస్తవంగా చెప్పాలంటే పండ్ల జాతికి చెందుతాయి. కొబ్బరి నూనె చర్మాన్ని సహజసిద్ధంగా తేమగా మారుస్తుంది. మీరు రోజూ తినే ఆహారంలో ఒక టీస్పూన్ కొబ్బరినూనెను చేర్చుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. కోల్డ్ ప్రెస్డ్ విధానంలో తయారు చేసిన కొబ్బరినూనెలో పోషకాలు అధికంగా ఉంటాయి. రిఫైన్ చేయబడిన కొబ్బరినూనెను ఉపయోగించకూడదు. కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఈ నూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొబ్బరినూనె యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కొబ్బరినూనెను వాడితే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి.
శిరోజాల సంరక్షణకు కొబ్బరినూనె ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెను వాడితే జుట్టుకు కలిగే నష్టాన్ని నివారించవచ్చు. దంతాలు, చిగుళ్ల సంరక్షణకు కూడా కొబ్బరినూనె పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ (11 గ్రాములు) కొబ్బరినూనె ద్వారా సుమారుగా 99 క్యాలరీల శక్తి లభిస్తుంది. 11 గ్రాములు కొవ్వు, 9.5 గ్రాముల శాచురేటెడ్ కొవ్వులు, 0.7 గ్రాముల మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, 0.2 గ్రాముల పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. కొబ్బరినూనెలో ఉండే మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది.
రోజూ రాత్రి పూట నిద్రకు ముందు ఒక టీస్పూన్ కొబ్బరినూనెను సేవిస్తుండాలి. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. పెద్ద పేగు శుభ్రంగా మారుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అలాగే కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి ఉండవు. కొబ్బరినూనెలో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు పనిచేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ నూనె ఎంతగానో పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా కొబ్బరినూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.